అనంతపురం జిల్లా(anantapur district)లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి (heavy rains) ముదిగుబ్బ, బుక్కపట్నం ప్రధాన రహదారి 15 కి.మీ.ల మేర పూర్తిగా దెబ్బతింది. అటవీ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీరు ప్రధాన రహదారి పక్కనే ఉన్న హంద్రీనీవా కాలువలోకి ఒక్కసారికి ఉద్ధృతంగా ప్రవహించటంతో కోతకు గురైంది. కుంట్ల ప్రాంతంలో 50 మీటర్ల మేర ఉన్న సిమెంటు రోడ్డు కింది భాగం కోతకు గురై ప్రమాదకరంగా మారింది. హంద్రీనీవా కాలువలోకి వరద నీరు పెద్దఎత్తున రావడంతో కాలువ పైభాగం సైతం కోతకు గురైంది. చెండ్రాయనిపల్లి సమీపంలో రోడ్డుపై రెండు అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ రహదారి గుండా బెంగళూరుకు వెళ్లే భారీ వాహనాలను ముదిగుబ్బ నుంచే దారి మళ్లించారు. కోతకు గురైన ప్రాంతాన్ని నేషనల్ హైవే డీఈఈ రామచంద్రరెడ్డి, ఎంపీపీ శ్రీధర్‌రెడ్డిలు పరిశీలించారు. వాహనాలు ఆ మార్గంలో ప్రయాణించకుండా ఎస్సై నరసింహుడు పోలీసులతో వెళ్లి బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మరువ ప్రవాహంతో మునిగిన వరి పొలాలు
బుక్కపట్నం చెరువు మరువ ప్రవాహం ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. మండల కేంద్రం కొత్తచెరువు దగ్గర 180 మీటర్ల పొడవున్న ప్రధాన మరువ అడుగు ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి చిత్రావతి నది నుంచి వరద రాకతో మరువ ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తచెరువు - బుక్కపట్నం మధ్య వంతెన తాకుతూ నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీనివల్ల గోరంట్లపల్లి మార్గంలోని గుర్రాల రోడ్డులో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మైలసముద్రం చెరువు ఆయకట్టులో నీట మునిగిన పొలాలను వ్యవసాయాధికారి నటరాజ్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి జరిగిన నష్టం వివరాలను తెలుసుకున్నారు.
నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలి
అకాల వర్షాలకు వరి పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకొనేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు(Former Minister Kalva Srinivasalu) డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కణేకల్లు, మారెంపల్లి, బ్రహ్మసముద్రం, బెణికల్లు తదితర గ్రామాల్లో భారీ వర్షానికి నేలవాలిన వరిపంట పొలాలను తెదేపా నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులను అడిగి జరిగిన నష్టాన్ని తెలుసుకొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి పంట నేలకొరిగి రైతులకు తీరని నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వందల ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట నేలకొరిగి నీటిలో తేలియాడుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల రైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నిబంధనల పేరుతో మోసం చేయాలని చూస్తే... రైతు ద్రోహమే అవుతుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ లాలెప్ప, నాయకులు ఆనందరాజ్, చంద్రశేఖరగుప్తా, లక్ష్మన్న, అనిల్, చాంద్‌బాషా, ముజ్జు, ఈరప్ప, శర్మాస్, అల్తాఫ్, జిలాన్, పోతప్ప తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి