పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లా రైతులను ఈసారి వర్షాలు ముంచెత్తాయి. ఏడాది పాటు చినుకు కోసం ఎదురుచూసే రైతులు... ఇక చాలనుకున్నా వరుణుడు మాత్రం వదలలేదు. సెప్టెంబరు నుంచి విడతల వారిగా కురిసిన వర్షాలు.... అన్నదాతను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. చేతికందిన పంట నీటిలో కొట్టుకుపోతుంటే దిక్కుతోచని స్థితిలో రైతన్న కూలబడిపోయాడు.
నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణంగా 338 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఈసారి 567 మిల్లీ మీటర్లు కురిసిందని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో 7 వేల హెక్టార్లలో సాగుచేసిన పంటలు నాశనమైందని తెలిపారు. ఏడాదంతా కురవాల్సిన వర్షం కంటే అధిక వర్ష పాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
ఖరీఫ్‌లో వేసిన పంటలు పూత దశలో ఉండగా, మరికొన్ని చోట్ల కోతకు సిద్ధమయ్యాయి. చివరకు పంటలన్నీ ఎడతెరిపి లేని వానలకు తుడిచిపెట్టుకుపోయాయి. వాగులు, కాలువలు పొంగిపొర్లి.... పొలాలు, తోటల్లోకి చేరి పంట నాశనమైంది. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ పూర్తిగా దెబ్బతింది. చీడ, పీడల నివారణకు వేల రూపాయలు ఖర్చుచేసిన రైతు.. చివరకు వానలతో పూర్తిగా నష్టపోయాడు.
జిల్లాలో 16 కోట్ల రూపాయల విలువైన పంటలు ధ్వంసమయ్యాయి. వ్యవసాయశాఖ అంచనా మేరకు 7 వేల హెక్టార్లలో పంట నాశనమైందని వ్యవసాయశాఖ తెలిపింది. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు.
వర్షాల ప్రభావంతో జిల్లా అతలాకుతలమైపోయింది. చేతికందిన పంట పూర్తిగా నాశనమవటంతో అన్నదాతలు లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వమే సరైన సహకారమందిస్తే కాస్త కోలుకుంటామని రైతన్న వేడుకుంటున్నాడు.
ఇదీ చదవండి: విలయం... వాయుగుండంతో రాష్ట్రంలో విధ్వంసం