Handri Neeva Sub Canals Water Supply Stopped in Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండలోని హంద్రీనీవా ఉప కాలువలకు అధికారులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా.. నీటి సరఫరాను మంగళవారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారులు నీటి సరఫరాను నిలిపివేయటం వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రధాన కాలువలోని నీటిని జీడిపల్లి జలాశయం మీదుగా తరలించాలన్న లక్ష్యంతో అధికారులు ఆన్ అండ్ అఫ్ పేరుతో నీటిని నిలిపివేశారని రైతులు ఆవేదను వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఉప కాలువ కింద కనీసం 2 వేల ఎకరాలకు పైగా మిరప పంట సాగులో ఉంది. కాలువ నీటిని వదలకపోతే చాలా మంది మిరప రైతులు నష్టపోతారని వాపోతున్నారు.
ఉరవకొండ నియోజవర్గంలో దాదాపుగా ఎనిమిది ఉప కాలువలకు అధికారులు నీటి సరఫరాను నిలిపేశారు. షటర్లు పని చేయని చోట, జేసీబీతో కాలువకు అడ్డంగా మట్టిని వేయించి నీటిని నిలిపివేస్తుండగా.. అక్కడి రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారని.. పోలీసుల సాయంతో హంద్రీనీవా అధికారులు నీటిని నిలిపివేశారని రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం మిరప పంట కీలక దశలో ఉంది. ఈ సయమంలో పంటకు నీటిని అందించకపోతే నష్టపోతామని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
"మిరప పంటకు పది రోజులు నీటి తడి అనేది లేకపోతే పంట చేతికి రాదు. కనీసం నాలుగు రోజులకోకసారి అయిన నీటిని అందిస్తే కానీ కాపు వస్తాది. అందుకే వెంటనే కాలువకు నీటిని రాకుండా వేసిన మట్టిని తొలగించి నీటిని విడుదల చేయాలి." -జగదీష్, రేణుమాకులపల్లి
Rayalaseema Farmers Waiting For HNSS Water: హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు
ఒక్కో ఉప కాలువ కింద కనీసం 2 వేల ఎకరాలకు పైగా మిరప పంట ప్రస్తుతం సాగులో ఉంది. ఆన్ అండ్ అఫ్ పద్దతిలో పది రోజులకు ఒకసారి నీరిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే మిరప పంట సున్నితమైంది. ఎక్కువ మంది రైతులు కాలువల నుంచి మోటర్ల ద్వారా నీటిని తోడుకుని, పంటకు నీటిని అందిస్తున్నారు. దీంతో ఐదారు ఎకరాలు సాగు చేసుకున్న రైతులు రోజూ నీటిని అందిస్తే గానీ పంట చేతికి రాదు. ఈ తరుణంలో పది రోజులకు ఒకసారి నీటిని ఇస్తే విద్యుత్తు సరఫరా మీద ఆధారపడి మిరప పంటకు తడులు అందించడం చాలా కష్టం అవుతుందని రైతులు వాపోతున్నారు.
"ఈ కాలువను నమ్ముకుని నేను పంటను సాగు చేస్తున్నాను. ఇప్పుడు నీళ్లు లేవు. కౌలుకి ఐదు ఎకరాలు తీసుకుని పంటను వేశాను. పంట మంచిగా చేతికి వచ్చే సమయంలో నీటిని నిలిపివేస్తే ఏ విధంగా పంటను సాగు చేసుకోవాలి. కాపు సరిగా రాకపోతే పెట్టిన పెట్టుబడి రాదు." -రవి, రైతు రేణుమాకులపల్లి