అనంతపురం జిల్లా రైతులు వేరుశనగను సుమారు 12 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది సాగుచేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం.. పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఎకరానికి రెండు, మూడు బస్తాలు కూడా రాని పరిస్థితి నెలకొంది. రైతును కోలుకోలేని దెబ్బ కొట్టింది.
నష్టం అంచనాలు..
సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భారీ వర్షాల ధాటికి.. చేతికందిన పంట తడిసిపోయింది. కనీసం పశుగ్రాసమూ దక్కని పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల ప్రవాహంలో పంట కొట్టుకుని పోయింది. జిల్లాలోని 13.050 హెక్టార్లలో.. రూ. 20 కోట్ల వరకు వివిధ పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వేరుశనగ పంట 9.828 హెక్టార్లలలో సాగవగా.. రూ.14 కోట్లు నష్టం వాటిల్లిందని నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి కేంద్ర బృందం సైతం జిల్లాకు వచ్చి వెళ్లింది.
వేరుశనగ రైతుకు కోలుకోలేని దెబ్బ..
గతేడాది ఖరీఫ్ సీజన్లో వర్షాలు అనుకూలించడంతో.. జిల్లాలో విస్తారంగా వేరుశనగ సాగైంది. జూన్, జులైలో అధికంగా వానలు కురిశాయి. వాటి ధాటికి పంట ఏపుగా పెరిగినా.. మొక్కకు రెండు, మూడు కాయలే ఉన్నాయి. ఎకరానికి రెండు, మూడు బస్తాలు కూడా దిగుబడి రాని పరిస్థితి నెలకొంది. తడిసిన కాయలూ నల్లగా మారాయి. పంటకోత ప్రయోగాల ద్వారా 1,100 కిలోల దిగుబడి రావాల్సి ఉండగా.. 400 నుంచి 500 కిలోలు మాత్రమే వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం వేరుశెనగ వల్ల సుమారు రూ. 1,500 కోట్ల నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రభుత్వం ఈ పంటకు రూ. 5,275 మద్దతు ధర ప్రకటించింది. గింజ బరువు 70 శాతం ఉండాలి, తేమ 8 శాతంలోపు ఉండాలని నిబంధన విధించింది. కాయలు రంగు మారడం, గింజ బరువు, తక్కువ తేమ శాతం ఉండటంతో.. కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
కొనుగోలు కేంద్రాల జాడేది?
వేరుశనగ పంట తొలగింపు ప్రక్రియ పూర్తవుతున్నా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల జాడ లేకుండాపోయింది. రైతులు వాటిని నిల్వ ఉంచేందుకు ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో, బళ్లారి వంటి ఇతర మార్కెట్లలో దళారులు, కమీషన్ ఏజెంట్ల సాయంతో అమ్మేస్తున్నారు. అందరూ అదే దారిలో సాగకముందే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. అరకొరగా పండిన పంటను ఎవరూ కొనడం లేదని రైతులు వాపోతున్నారు. వేరుశనగ పంటను పరిశీలించి ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని రైతులు వేడుకున్నారు.
కేంద్ర బృందం పర్యటన..
భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు.. కేంద్ర బృందం సోమవారం ప్రత్యేక హెలికాప్టర్లో జిల్లాకు చేరుకున్నారు. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. నష్టం విలువ, పెట్టుబడి, ఇతర వివరాలను వేరుశనగ రైతులను అడిగి తెలుసుకున్నారు. తొలగించిన దెబ్బతిన్న పంటలనూ పరిశీలించారు. 13 వేల హెక్టార్లలో పంటలు పాడవగా.. పది వేల హెక్టార్లలో వేరుశనగకు నష్టం జరిగినట్లు జిల్లా అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు.
ఇదీ చదవండి: ఆలయ భూమిలో సచివాలయ నిర్మాణాన్ని ఆపాలి: విష్ణువర్ధన్ రెడ్డి