అనంతపురంలో..
మహాత్మాగాంధీ చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజలకు సేవ చేయడానికి ప్రతిఒక్కరూ ఐక్యత చాటాలని నిత్యసురభి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్పర్సన్ నిర్మలమురళి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదర్శనగర్‌లో ఉన్న సంచార జాతుల పేద కుటుంబాలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహకులు నిర్మల మురళి, కవిన్ ఆదిత్య నిత్యావసర సరకులు అందజేశారు. మనకున్న దానిలో బాధ్యతగా భావించి పేదలకు చేయూత ఇవ్వడానికి ముందుకు రావాలన్నారు. ట్రస్ట్... పేద ప్రజలకు ఎల్లపుడు అండగా ఉంటుందని తెలిపారు.
హిందూపురంలో...
హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన మనీషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌గాంధీపై దాడిని ఖండిస్తూ నిరసన చేశారు. ఐదు లాంతర్ల కూడలి వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మోకాళ్లపై కూర్చుని ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును తప్పుబట్టారు. ఇప్పటికైనా బాధిత కుటుంబం పట్ల సానుభూతి చూపి వారికి న్యాయం చేయాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నీలకంఠాపురంలో..
మడకశిర మండలం నీలకంఠాపురంలో గాంధీ జయంతి వేడుకల్లో మాజీమంత్రి రఘువీరారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలతో, కుటుంబసభ్యులతో కలిసి గాంధీ జయంతి వేడుకలు జరుపుకున్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింసా, ధర్మం, మార్గాలలో నడిచారు బాపూజీ అని కొనియాడారు. కుల, మాత,వర్గ విభేదాలు లేకుండా భారతదేశం అభివృద్ధి చెందేందుకు కృషి చేసి అమరులయ్యారని తెలిపారు. ఆయన చూపిన అడుగుజాడలు ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు.
చామలూరులో..
జిల్లాలోని నార్పల మండలం చామలూరు గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా మనం- మన పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్లతో సమానమని.. వారి సేవలకు రుణపడి ఉండాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వ్యాఖ్యానించారు. 13 మంది పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.
బుక్కరాయసముద్రంలో...
బుక్కరాయసముద్రం మండలం గాంధీనగర్‌లో మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సభ్యుడు ఆలూరు సాంబశివారెడ్డి.. సిద్దరాంపురం రోడ్డు పార్క్ దగ్గర ఉన్న చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాన్ని సందర్శించారు.
ఇదీ చూడండి. గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు గవర్నర్ నివాళులు