TDP Leader Kalva Srinivas: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి హీరేహాల్, బొమ్మనహల్ మండలాల్లో ఇసుక అక్రమ రవాణా ద్వారా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, అతని అనుచరులు అక్రమంగా ప్రతినెలా రూ. కోట్లు దండుకుంటున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కాపు, అతని అనుచరుల ఇసుక అక్రమ రవాణాను తెలిపేందుకు సోమవారం పాదయాత్ర చేయనున్నట్లు కాలవ స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి సాక్ష్యాధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తాను తెదేపా ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణా చేశానని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు.. వాళ్ల ప్రభుత్వంలో విచారణ జరిపించుకోవచ్చని కాలవ సవాల్ విసిరారు. తిమ్మాలాపురం చెందిన రైతులు, ప్రజలు ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక పరిశోధనా ఏజెన్సీ ద్వారా విచారణ జరిపి అక్రమార్కులను జైలుకు పంపుతామన్నారు. పాదయాత్ర కోసం తాము ఈనెల ఆరో తేదీనే పోలీసులను అనుమతి కోరామని తెలిపారు.
పాదయాత్రకు అనుమతి నిరాకరణ: కాలవ శ్రీనివాసులు తలపెట్టిన పాదయాత్రకు కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు అనుమతి నిరాకరించారు. ఈ విషయంపై రాయదుర్గం అర్బన్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై సుమన్ కాలవకు నోటీసులు జారీ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా పాదయాత్ర జరిపే రోడ్డు ఇరుకుగా ఉన్నందున ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని.. అందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు చెప్పారు.
శాంతియుతంగా చేస్తాం: తాము జనావాసాల్లో పాదయాత్ర చేయడం లేదని, శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని కాలవ పోలీసులకు తెలిపారు. సోమవారం పెద్ద ఎత్తున పాదయాత్ర చేసేందుకు కాలవ సన్నద్ధమయ్యారు. మరీ జీవో నెం.1 నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ర్యాలీలను అడ్డుకుంటున్న పోలీసులు కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రపై ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇవీ చదవండి