మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చేసుకుని నకిలీనోట్లు చలామణి చేస్తున్న ఓ యువకుడు అనూహ్యంగా పోలీసులకు పట్టుపడటంతో అసలు విషయం వెలుగుచూసింది. అనంతపురం జిల్లా కదిరిలో సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తోన్న పోలీసులకు యువకుడి తీరు పట్ల సందేహం కలిగింది. వాహన రికార్డులను తనిఖీ చేస్తుండగా.. అతని పర్సులోని నోట్లపై అనుమానం కలిగింది. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
యువకుడి వద్ద ఉన్న రూ.200, రూ.100నోట్లపై సందేహం కలగడంతో యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని తనకల్లు మండలం చెక్కవారిపల్లికి చెందిన ముద్దల చిన్నబాబు అలియాస్ జాన్ గా గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.
నిందితుడు ఫ్రింటర్ సాయంతో రూ.200,రూ.100 నోట్లను జిరాక్స్ తీసుకుని వాటిని చలామణి చేస్తున్నట్లు అంగీకరించారు. నిందితుడి నుంచి రూ.17,100 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు. అతని నుంచి నకిలీనోట్లతోపాటు ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: CC Video: పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఆకతాయిల దాడి..