అనంతపురం జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు ఆదేశాల మేరకు గుంతకల్లు నియోజకవర్గ వ్యాప్తంగా నాటుసారా బట్టీలపై సివిల్ పోలీసులు, ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఒకేరోజు 11,080 లీటర్ల బెల్లం ఊటతో పాటు, 54 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు తయారీ దారులని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 10 ప్రదేశాలలోని కొండ గుట్టల్లో సారా స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని గుంతకల్లు డీఎస్పీ ఖాసీంసాబ్ తెలిపారు. పులగుట్టపల్లి తండాలో1300 లీటర్ల బెల్లం ఊట, 40లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేశారు. గుత్తి మండలంలోని బసినేపల్లి తండా, కొత్తపల్లి, యాడికి మండలంలోని పుప్పాల తండా కొండగుట్టల్లో 6500 లీటర్ల బెల్లం ఊట, 14 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు. పామిడి మండలంలోని రామగిరి దిగువ తండాలో 3380 లీటర్ల బెల్లం ఊట, 465 కేజీల నల్లబెల్లంను పట్టుకుని ఇద్దరు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నామన్నారు. తండా వాసులకు నాటుసారా విక్రయించొద్దని.... సారా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సారా తయారీ దారులపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని, బైండోవర్ కేసులు నమోదు చేస్తామని, 2లక్షలు వరకు పూచికత్తు ఉండేలా కేసులు నమోదు చేస్తామని అన్నారు. సారాపై కేసులు నమోదు చేస్తే వారికి భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందవని హెచ్చరించారు.
ఇదీచూడండి. సర్జికల్ స్పిరిట్ ఘటనలో మరో ఇద్దరు మృతి