వేసవికాలం రావడంతోనే.. భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం కోసం చల్లటి వాతావరణంలో సేదతీరడానికి ఆరాటపడుతున్నారు. శీతల పానీయాలు సేవిస్తూ దప్పిక తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక పక్క కరోనా.. మరోవైపు సూర్య ప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం పది దాటితే బయటకు రావాలంటేనే ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. పని నిమిత్తం బయటికి వస్తే.. ఎక్కడ కొంచెం నీడ కనిపించినా.. టక్కున వెళ్లి నిలబడే పరిస్థితి ఏర్పడింది. నిత్యం రోడ్లపైకి వస్తున్న వాహనదారుల బాధలను కొంతమేరైనా తీర్చేందుకు.. అనంతపురం మున్సిపాలిటీ అధికారులు చేసిన ప్రయత్నాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు.
వాహనదారులకు ఉపశమనం:
ట్రాఫిక్‌లో సిగ్నల్ పడిందంటే.. ఈ ఎండల్లో ఇక అంతే సంగతులు. ఈ పరిస్థితుల్లో వాహనదారుల కోసం అనంతపురం మున్సిపల్ అధికారుల చేసిన ఆలోచన.. నగరవాసుల ప్రశంసలు అందుకుంటోంది. మండుటెండల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ''షాడో నెట్లు'' ఏర్పాటు చేసి కాస్తంత ఉపశమనం కల్పించేందుకు అధికారులు చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది.
ప్రధాన కూడళ్లలో షాడో నెట్ సేవలు:
నగరంలోని క్లాక్ టవర్, సప్తగిరి, శ్రీకంఠం సర్కిళ్ల పరిసర ప్రాంతాల్లోని సిగ్నల్స్ వద్ద.. వాహనదారులు ఎక్కువ సమయం ఎండలో వేచిఉండాల్సి వస్తోంది. ఈ ప్రదేశాల్లోనే పురపాలక సంఘం అధికారులు షాడో నెట్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ పడిన సమయంలో.. తెర నీడ చాటున ఎండ నుంచి కొంతమేర వాహనదారులకు ఉపశమనం కల్పించడానికి ప్రయత్నం చేశారు.
అభినందనీయం...
మండుతున్న ఎండల నుంచి వాహనదారులను రక్షించేందుకు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన షాడో నెట్లు.. కొంతమేర ఉపశమనం కల్పిస్తున్నాయి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఈ తరహా సౌకర్యాలు కల్పిస్తే ఇంకా బాగుంటుంది. - వాహనదారులు
స్పందన బాగుంది:
అనంతపురంలోని కొన్ని ప్రధాన కూడళ్లలో షాడో నెట్లు ఏర్పాటు చేశాం. వాహనదారులకు కొంత మేరైనా ఎండ నుంచి ఉపశమనం కల్పించాలని ఆలోచించాం. మా ప్రయత్నానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రానున్న రోజుల్లో నగరంలోని పలు చోట్ల చలివేంద్రాలు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. - వీవీఎస్. మూర్తి, అనంతపురం మున్సిపల్ కమిషనర్.
ఇదీ చదవండి: