కొవిడ్ కారణంగా కిందటేడాది నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో శస్త్రచికిత్సలు తగ్గాయి. వైరస్ ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుండటంతో ఆపరేషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. విజయవాడ, గుంటూరు జీజీహెచ్, విశాఖ కేజీహెచ్, తిరుపతి రుయా, కాకినాడ జీజీహెచ్, ఇతరచోట్ల శస్త్రచికిత్సలు ఎక్కువ సంఖ్యలో చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో ఆసుపత్రులను నిధుల కొరత వేధిస్తోంది. ఉచిత వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేదలపై ఈ పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు వాపోతున్నారు. ‘‘శస్త్రచికిత్స కోసం అవసరమైన వస్తువుల్లో సగమే వస్తున్నాయి. దూది, స్పిరిట్‌ల కోసమూ వెంపర్లాడే(shortage of cotton and spirits) పరిస్థితులు తలెత్తుతున్నాయి. హెర్నియా వంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఉపయోగించే వస్తువులకూ కొరత వస్తోంది’’ అని కోస్తాకి చెందిన ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శస్త్రచికిత్సలు, ఇతర అవసరాల కోసం రూ.127 కోట్లు కావాలని వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు పంపితే కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇందులో బోధనాసుపత్రులకు రూ.12 కోట్లు, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రులకు రూ.5 కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.3 కోట్లు కేటాయించడం గమనార్హం.
- అనంతపురంలో శస్త్రచికిత్సలకు అవసరమైన మందులను బయటి నుంచి తెచ్చుకోవాలని రోగుల బంధువులకు వైద్యులు సూచిస్తున్నారు. మత్తుమందులను స్థానికంగా కొనుగోలు చేశారు. సర్జికల్ గ్లౌజుల కొరత ఉంది. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ కోరగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
- నెల్లూరు జీజీహెచ్‌లో గతంలో నెలకు 500 శస్త్రచికిత్సలు జరిగేవి. ఇప్పుడు తక్కువగా జరుగుతున్నాయి. సర్జికల్ పరికరాలు, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్, ల్యాప్రోస్కోపిక్ పరికరాలు కూడా అవసరాలకు తగ్గట్లు లేవు.
మొదటి నుంచీ నిధులకు కటకటే
శస్త్రచికిత్సలకు కేటాయించే బడ్జెట్‌లో నుంచి 80% నిధులతో రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ... గ్లౌజులు, సిరంజీలు తదితరాలను కొని, ఆసుపత్రులకు పంపిస్తుంది. మిగిలిన 20% నిధులను ఆసుపత్రులకే నేరుగా ఇస్తారు. ఈ నిధులతో అత్యవసర సమయాల్లో, అభివృద్ధి సంస్థ నుంచి పంపిణీ జరగని వాటిని మాత్రమే కొనాల్సి ఉంటుంది. ఇలా కొనుగోలు చేయాల్సిన వాటికి కూడా నిధుల కొరత నెలకొంది. గతంలో ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్సలకు ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ఆసుపత్రులకు నిధులు వచ్చేవి. వీటి చెల్లింపుల్లోనూ ప్రస్తుతం స్తబ్ధత నెలకొంది.మరోవైపు వైద్యారోగ్య శాఖకు శస్త్రచికిత్సలకు నిధుల కేటాయింపులో మొదటి నుంచీ ఉదాసీనంగానే ఉంటున్నారు. సంబంధిత శాఖ అధికారులు మాత్రంతాము అదనపు నిధుల కేటాయింపునకు ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని, త్వరలోనే మంజూరవుతాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
ఇదీ చదవండి...
Children drowned: అనంతపురంలో విషాదం.. చెరువులో ముగ్గురు చిన్నారులు గల్లంతు