DRDA Officials Frauds Dwakra Womens: బటన్ నొక్కి జగనన్న ఇస్తున్న ఆసరా సొమ్ము అక్కాచెల్లెమ్మల చేతికి అందటం లేదు. తీసుకున్న రుణాలకు కరోనా సమయంలో ఒక్క రూపాయి కూడా కంతు చెల్లించలేదంటూ బ్యాంకు అధికారులు ఆసరా సొమ్మును వడ్డీ కింద జమ చేసుకుంటున్నారు. కంతులు ఎందుకు కట్టలేదంటూ బ్యాంకర్లు నిరుపేద డ్వాక్రా మహిళలకు నోటీసులు పంపిస్తూ, ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లిలో 32 డ్వాక్రా గ్రూపులున్నాయి. రాష్ట్రంలో రుణాలు తీసుకొని, తిరుగు చెల్లింపు చేయటంలో ఈ గ్రామంలోని డ్వాక్రా గ్రూపు మహిళలు అవార్డులు అందుకున్నారు. రుణాలు తీసుకొని వాటితో స్వయం ఉపాధి కల్పించుకోవటంలోనూ, పిల్లలను ప్రయోజకులను చేయటంలోనూ ఈ గ్రామ సంఘాలకు ఉత్తములుగా పేరుంది.
ఈ గుర్తింపుతోనే బ్యాంకర్లు ఈ మహిళా సంఘాలు ఎంత రుణం అడిగినా అట్టే ఇచ్చేస్తున్నారు. ఈ గ్రూపు సభ్యులైన మహిళలు కూడా క్రమం తప్పకుండా కూలీ చేసి నెలవారీ కంతులు చెల్లించేవారు. కరోనా సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడి బ్యాంకు కంతులు చెల్లిస్తూ వచ్చారు. అయితే బ్యాంకు మూత పడటంతో గ్రూపు సభ్యులు.. డీఆర్డీఏ అధికారులకు కంతుల సొమ్ము ప్రతినెల చెల్లించారు. అయితే పేద మహిళల నుంచి తీసుకున్న సొమ్మును వాళ్లు బ్యాంకులో జమ చేయకుండా కాజేశారు.
లాక్ డౌన్ సడలించాక బ్యాంకర్లు కూడా నెలవారి కంతుల సొమ్మ జమ కాలేదని ఒక్కసారి కూడా మహిళలను ప్రశ్నించలేదు. బ్యాంకు రుణం మొత్తం తిరిగి చెల్లించామని భావిస్తున్న మహిళలకు బ్యాంకులు తాఖీదు ఇచ్చారు. లక్షల రూపాయలు బకాయి ఉన్నట్లుగా చెబుతున్నారు. లబోదిబోమంటూ గ్రూపుల్లోని పేద మహిళలంతా కలెక్టరేట్లో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
బొమ్మలాటపల్లి గ్రామంలో దాదాపు 26 గ్రూపుల సభ్యులకు సంబంధించి నెలవారీ కంతుల సొమ్మును డీఆర్డీఏ సిబ్బంది కాజేసారు. ప్రతి సంఘం లక్షన్నర నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు బకాయి ఉన్నట్లు బ్యాంకర్లు ఇచ్చిన నోటీసుతో కంగుతిన్న మహిళలు బుక్కరాయ సముద్రం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోకుండా కలెక్టర్‌ను కలవాలని చెప్పినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. జగనన్న ఆసరా పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాకు వచ్చిన సొమ్ము కూడా బ్యాంకర్లు ఇవ్వకుండా, సిబ్బంది కాజేసిన సొమ్ముకు వడ్డీ కింద జమ చేసుకుంటున్నట్లు డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"వివిధ సంంఘాల నుంచి దాదాపు 2 లక్షలు కాజేశారు. మేము చెల్లించిన డబ్బులను మరలా కట్టించుకుంటున్నారు, ఆసరా డబ్బులు వచ్చాయి. వాటిని తీసుకోనివ్వడం లేదు. అందులోకే జమ చేసుకుంటున్నారు. మేము ఎలా కట్టాలి. మాకు భూమి కూడా లేదు. ప్రశ్నిస్తుంటే ప్రభుత్వ పథకాలు రానివ్వమంటూ బెదిరిస్తున్నారు. మాకు న్యాయం కావాలి."- బాధిత మహిళలు
ఇవీ చదవండి