రాయదుర్గంలో వైకాపా నేత జయరామిరెడ్డి బెదిరింపులపై గుత్తేదారు సంస్థ డీఎంసీ(ద్వారకామయి కనస్ట్రక్షన్) స్పందించింది. జయరామిరెడ్డికి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి సంబంధం లేదని స్పష్టం చేసింది. తమకు కాంట్రాక్ట్ పనులు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇచ్చారని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఎమ్మెల్యే పేరు చెప్పి జయరామిరెడ్డి అందరినీ బెదిరిస్తుంటారని వెల్లడించారు. జయరామిరెడ్డిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు. ఎమ్మెల్యే సహకారంతోనే నియోజకవర్గంలో పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి 15 ఏళ్లుగా తమకు సహకరిస్తున్నారని తెలిపారు.
'ఎమ్మెల్యే పేరు చెప్పి జయరామిరెడ్డి అందరినీ బెదిరిస్తుంటారు. జయరామిరెడ్డిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాం. ఎమ్మెల్యే సహకారంతోనే నియోజవర్గంలో పనులు చేస్తున్నాం. 15 ఏళ్లుగా మాకు సహకరిస్తున్నారు' - ద్వారకామయి కనస్ట్రక్షన్స్ సంస్థ
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్.. ఏం జరిగిందంటే
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు...వైకాపా నాయకుడు జయరామిరెడ్డి ఓ గుత్తేదారుపై బెదిరింపులకు దిగారు. రాయదుర్గం - కనేకల్ రహదారి పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులేలా చేస్తారని గుత్తేదారుపై మాటలతో దాడికి దిగారు. పనులు ఆపకపోతే భౌతిక దాడులు తప్పవని బెదిరించారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి ..14 కిలోమీటర్ల వరకు రహదారి నిర్మాణ పనులకు ఆమోదం తెలిపారు. నిర్మాణ పనులకు 17 కోట్ల రూపాయలు కూడా మంజూరయ్యాయి. డీఎంసీ సంస్థ కాంట్రాక్టును సొంతం చేసుకుని పనులు చేపట్టింది. అయితే..స్థానిక ఎమ్మెల్యేను అడగకుండా పనులు చేపట్టడం ఏంటని..వైకాపా నేత జయరామిరెడ్డి గుత్తేదారుపై బెదిరింపులకు దిగారు.
"ఏయ్ మీ వాడిని వచ్చి మాట్లాడమనండి. నా ఫోన్ ఎత్తడా. పనులన్నీ అపేయండి. లేకుంటే అన్ని పగులగొట్టిస్తా. చేతనైతే పోలీసు కంప్లైంట్ ఇవ్వమనండి. నాకు కొత్తేం కాదు. నాకు తెలియకుండా పని మెుదలుపెడతాడా. నేను ఎవర్ని వదలను. అన్ని వాహనాల అద్దాలు పగులగొట్టిస్తా. ఏదైనా ఉంటే వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడమనండి." అంటూ బెదిరింపులకు దిగాడు.
బెదిరింపులకు దిగిన వైకాపా నేత జయరామిరెడ్డిది...రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం కాలేకుర్తి గ్రామం. జయరామిరెడ్డి భార్య ఉషారాణి రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి