Deficit Rains Cause Huge Crop Loss in Anantapur District: ఈసారి ఖరీఫ్ సీజన్లో సకాలంలో వర్షం కురవక పంట వేసిన రైతులు పూర్తిగా నష్టపోయారు. అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి నైరుతి రుతుపవనాల కదలిక మందకొడిగా ఉండటంతో తీవ్ర వర్షాభావం నెలకొంది. తొలుత కొద్దిపాటి వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు వేశారు. తరువాత వర్షాలు లేక పంట కీలక దశలో తీవ్ర బెట్టకు గురికావటంతో తీవ్రంగా నష్టపోయారు. సెప్టెంబర్ తొలి వారంలో కురిసిన వర్షానికి ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోటంతో చాలా మంది రైతులు పంట తొలగిస్తున్నారు. ఆముదం పంట కంకులు పొట్టిగా వచ్చి తాలుగింజలే దిగుబడి అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షల హెక్టార్ల భూమి ఖాళీగా: జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 3.7 లక్షల హెక్టార్లు ఉండగా.. తీవ్ర వర్షాభావంతో (Low Rainfall Conditions) 2.52 ఎకరాల్లో మాత్రమే రైతులు పంట సాగుచేశారు. మొత్తం జిల్లా అంతటా 68 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు వేయగా.. 1.19 లక్షల హెక్టార్లలో రైతులు ఏ పంటా వేయలేక భూమిని ఖాళీగా ఉంచాల్సి వచ్చింది. వేరుసెనగ, ఆముదం పంటలు సాగుచేసిన రైతులు ఈసారి తీవ్రంగా నష్టపోయారు. సాధారణ విస్తీర్ణంలో 53 శాతం మాత్రమే వేరుసెనగ పంట సాగుచేశారు.
దిగుబడి రాక.. పంటను తొలగిస్తున్న రైతులు: సెప్టెంబర్ తొలి వారంలో కురిసిన వర్షానికి చెట్టు పచ్చగా మారినా, కాయలు మాత్రం రాలేదు. దీంతో దిగుబడి రాకపోవడంతో పలు మండలాల్లో చాలా మంది రైతులు ట్రాక్టర్‌తో పంటను తొలగిస్తున్నారు. ఆముదం పంట ఈసారి సాధారణం కంటే అధికంగా సాగుచేసినప్పటికీ.. సకాలంలో వర్షం కురవకపోవటంతో కంకి పొడవు తగ్గటమే కాకుండా 60 శాతంపైగా తాలుగింజలు వస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఖరీఫ్ పంట నష్టం పరిశీలనకు వెళ్లిన వ్యవసాయశాఖ అధికారుల బృందం వేరుసెనగ, ఆముదం పంటలకు తీవ్ర నష్టం ఏర్పడిందని ప్రభుత్వానికి నివేదించారు. దేశంలో ఒకే పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేసే జిల్లాగా గుర్తింపు ఉన్న అనంతపురంలో ఈసారి వేరుసెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట కీలక దశలో ఉన్నపుడు తీవ్ర బెట్టకు గురికావటంతో వేరుసెనగ ఊడలు దిగలేదు.
కీలక దశలో తీవ్రంగా దెబ్బతింది: ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి నైరుతి రుతుపవనాల కదలిక మందకొడిగా మారటంతో తీవ్ర వర్షాభావం నెలకొంది. దీంతో ఈసారి రాయలసీమ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనంతపురం జిల్లాలో జూలైలో కొన్నిచోట్ల కురిసిన కొద్దిపాటి వర్షానికి రైతులు విత్తనాలు వేశారు. అనంతరం వర్షాలు లేకపోవటంతో పంట కీలక దశలో తీవ్రంగా దెబ్బతింది. వేరుసెనగ, ఆముదం పంటలు వేసిన వారికి కనీసం వేసిన విత్తనం ఖర్చుకూడా రాలేదు.
ఖరీఫ్ పంట నష్టం పరిశీలనకు వెళ్లిన వ్యవసాయశాఖ అధికారుల బృందం.. వేరుశెనగ, ఆముదం పంటలకు తీవ్ర నష్టం ఏర్పడిందని ప్రభుత్వానికి నివేదించింది. క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా.. ప్రభుత్వం రైతులకు పంట బీమా పరిహారం, ఇన్ పుట్ సబ్సిడీ మంజూరు చేస్తుందని వ్యవసాయశాఖ జిల్లా అధికారులు చెబుతున్నారు.
'ఎండ మండుతోంది.. పైరు ఎండుతోంది'.. మరో రెండు రోజుల్లో అలా జరగకుంటే..!