ప్రశాంతంగా ఉన్న చంద్రగిరిని కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. మూడు రోజుల క్రితం ముంబై నుంచి వచ్చిన ఓ యువకుడు కరోనా వైరస్ సోకి ఆసుపత్రి పాలయ్యాడు. ముంగిలిపట్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు ఆదే గ్రామానికి చెందిన మరో వృద్ధుడుకి సైతం వైరస్ సోకి రుయా ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
తాజాగా చంద్రగిరి, ముస్లిం పేటకు చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు కరోనా వైరస్ బారిన పడ్డారు. మార్చి17 వ తేదీన ఓ వ్యక్తి ఏడుగురు కుటుంబ సభ్యులతో కలసి ముంబైలోని అత్తగారింటికి వెళ్లాడు. లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయాడు. లాక్డౌన్ సడలింపులతో వారం క్రితం ముంబై నుంచి అనంతపురానికి ట్రైన్లో... అక్కడ నుంచి క్యాబ్‌లో చంద్రగిరికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం ఆ కుటుంబంలోని ఇద్దరి శాపిల్స్ తీసి పరీక్షలకు పంపారు. రిపోర్ట్స్‌లో కరోనా పాజిటివ్ నిర్థరణ అయ్యింది. దీంతో వారిని రుయాలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మిగిలిన ఆరుగురిని క్వారంటైన్‌కు పంపించారు. మొదట ఈ ఆరుగురు వైద్య పరీక్షలకు సహకరించలేదని అధికారులు తెలిపారు. మొత్తం 7 పాజిటివ్ కేసులు యాక్టివ్ లో ఉండడంతో చంద్రగిరి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అధికారులు శానిటేషన్, పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: రాయదుర్గం సచివాలయ ఉద్యోగి సస్పెండ్