అనంతపురం అంటే కరవు గుర్తుకొస్తుంది. ఇలాంటి జిల్లాలో కళలకు కొదవలేదు. ఇక్కడినుంచి ఎన్నో కళలు విస్తరించాయి. సినీ రంగంలో అడుగుపెట్టి.. మెగాఫోన్ చేపట్టారు. నటులతో స్టెప్పులేయిస్తున్నారు. స్వరాలు సమకూరుస్తూ.. రాగాల పల్లకిలో ఊరేగుతున్నారు. గాయకులుగా శ్రోతలను అలరిస్తున్నారు. కథానాయకులుగా ఆకట్టుకునే నటనతో కట్టిపడేస్తున్నారు. జిల్లా నుంచి బాలీవుడ్, టాలీవుడ్‌లో దర్శకులు, కథానాయకులు, గాయకులుగా పేరు సంపాదించారు. తమ ప్రతిభతో ప్రేక్షకులను రంజింపజేస్తూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింప జేస్తున్నారు.
నృత్యం.. ఆపై నటన
‘ఖోఖో’ సినిమా ద్వారా పరిచయమైన కథానాయకుడు రాజేష్ అనంత నగరానికి చెందినవారే. కమ్యూనిస్ట్ నాయకుడు ఆంజనేయులు కుమారుడు. చిన్నతనం నుంచి సినిమాలంటే ఆసక్తితో ఆ రంగం వైపు అడుగులు వేశారు. డిగ్రీ చదువుతూనే నటన, నృత్యంలో శిక్షణ పొందారు. 2001లో సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్లారు. జిల్లాకు చెందిన సినీ డిస్ట్రిబ్యూటర్ అంబటి మల్లికార్జున సాన్నిహిత్యంతో దర్శకుడు అశోక్ (పిల్లజమీందార్, భాగమతి)తో పరిచయం ఏర్పడింది. ఆయన దర్శకత్వంలో మొదటి సినిమా ‘ఫ్లాష్‌న్యూస్’ చేశారు. దాంతో మంచిపేరు రావడంతో ‘ఖోఖో’, ‘వెతికా నేను నా ఇష్టంగా’ హీరోగా నటించారు. చక్రి దర్శకత్వంలో హిందీలో ‘ఆదత్’లో నటించారు. ప్రస్తుతం ముకుందారెడ్డి దర్శకత్వంలో ఓ కొత్త సినిమాలో హీరోగా నటిస్తున్నారు. సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా సమయంలో ప్రధానమంత్రి జన్‌కల్యాణ్ క్యాంపెయిన్‌లో భాగంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి జనరల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో సినీ పరిశ్రమకు చెందిన వారికి సుమారు రూ.20 కోట్ల మేర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఒక్క ఛాన్స్ అంటూ..
మిమిక్రీ కళాకారుడిగా, కమెడియన్‌గా నవ్వులు పూయిస్తున్న ర్యాంబో రవి నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందినవారు. తండ్రి నారాయణ ఆర్టీసీలో అసిస్టెంట్ క్లర్క్‌గా పదవీ విరమణ పొందారు. రవికి కథానాయకుడు చిరంజీవి అంటే వల్లమాలిన అభిమానం. ఆయన సినిమాలు చూస్తూ.. తాను హీరో కావాలని కలలు కన్నారు. సినిమా పిచ్చితో హైదరాబాద్ బస్సెక్కారు. అవకాశాల కోసం స్టూడియోలు, దర్శకులు, నిర్మాతల చుట్టూ ప్రదర్శనలు చేశారు. ఒక్క అవకాశం ఇవ్వండని ప్రయత్నాలు చేశారు. తాను నేర్చిన మిమిక్రీతో టీవీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘జీ తెలుగు’ ఛానల్లో ప్రసారమయ్యే కామెడీ కిలాడీలు షో ద్వారా వెలుగులోకి వచ్చారు. జెమినీలో ‘జూలకటక’లో మిమిక్రీ, కమెడియన్‌గా అవకాశం వచ్చింది. అలాగే జీ తెలుగులో ‘అదిరింది’ కామెడీ షోలో చేశారు. అడపాదడపా ఈటీవీ ప్లస్, జెమిని టీవీల్లో సీరియళ్లలో నటించారు. 2015లో కన్నడ సినిమా ‘నాలాయక’కు బెంగళూరులో జరిగిన అడిషన్స్‌లో ఎంపికయ్యారు. ఆ సినిమాలో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ క్రమంలో ‘ప్రేమపందెం’, ‘యాంటీ వైరస్’ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. నారా రోహిత్, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తున్న ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాలో హాస్యనటుడిగా నటించారు.
అన్న బాలీవుడ్.. తమ్ముడు టాలీవుడ్
అనంతలోని నీరుగంటి వీధికి చెందిన హెచ్చెల్సీ ఇంజినీర్ నారాయణ, బాలకోటమ్మ దంపతుల కుమారులు ఈశ్వర్ నివాస్, కృష్ణకిషోర్. వీరిలో నివాస్ బాలీవుడ్‌లో దర్శకుడు కాగా, తమ్ముడు కృష్టకిషోర్ టాలీవుడ్‌లో సహాయ దర్శకుడిగా గుర్తింపుపొందారు.
ఈశ్వర్ ‘శూల్’..
నివాస్ రెండు దశాబ్దాల పాటు రాంగోపాల్‌వర్మ శిష్యరికంలో పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేశారు. ఈయన సినీ రంగ ప్రవేశం ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే జరిగింది. నాగార్జున ‘శివ’ సినిమా సమయంలో ఆఫీస్‌బాయ్‌గా చేరారు. ఈక్రమంలో రామ్‌గోపాల్ వర్మతో సాన్నిహిత్యం ఏర్పడింది. క్షణక్షణం, రంగీలా, సత్య సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. తర్వాత 1999లో మనోజ్ బాజ్‌పాయ్, రవీనాటాండన్ జంటగా నటించిన ‘శూల్’ సినిమాకు దర్శకత్వం వహించి హిట్ కొట్టారు. ‘శూల్’కు ఉత్తమ దర్శకుడిగా జాతీయ సినిమా అవార్డు లభించింది. 2001లో సైఫ్ అలీఖాన్ కథానాయకుడిగా ‘లవ్ కేలియే కుచ్‌బీ కరేగా’, 2003 వివేక్ ఒబేరాయ్ కథానాయకుడిగా ‘దమ్’, 2004లో బాబిడియోల్‌తో ‘బర్దాష్’, 2008లో ‘మై నేమ్ ఈజ్ ఆంటోని’, డీటాలి, 2014లో ‘టోటల్ సియాపా’, 2017లో ‘జబ్‌రాత్ హోతీ హై’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘యువరానర్’ అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. దీనికిగాను పలు పురస్కారాలు అందుకొన్నారు. లాక్‌డౌన్ సమయంలో హిందీలో వ్యాపార ప్రకటనలు (యాడ్స్) తీశారు.
కెమెరా నుంచి దర్శకుడిగా..
అన్న నివాస్ బాటలోనే కెరీర్‌కు బాటలు వేసుకున్నారు కిషోర్. కెమెరామెన్‌గా కెరీర్‌ను ప్రారంభించి దర్శకుడిగా స్థిరపడ్డారు. మొదట్లో ‘పౌర్ణమి’ సినిమా దర్శకుడు శోభన్ దగ్గర సహాయకుడిగా చేరారు. తర్వాత 20 సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన పలు సినిమాలకు పనిచేశారు. పూరీకి ప్రియశిష్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన శిష్యరికంలో జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్’, రవితేజ ‘నేనింతే’, ప్రభాస్ ‘బుజ్జిగాడు’, నితిన్ ‘హార్ట్‌ఎటాక్’, గోపీచంద్ ‘గోలీమార్’, ఛార్మి నటించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలకు పనిచేశారు. కృష్ణవంశీ దగ్గర గోపీచంద్ ‘మొగుడు’, సందీప్ కిషన్ ‘నక్షత్రం’ చిత్రాలకు సహాయకుడిగా ప్రతిభ చూపారు. సొంత దర్శకత్వ పర్యవేక్షణలో లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రధారిగా ‘వేర్ ఈజ్ మహాలక్ష్మి’ సినిమా తీశారు. ప్రస్తుతం ‘హిప్పీ’, ‘క్షీర సాగర మథనం’, చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా నటించిన సినిమాలు విడుదల కావలసి ఉంది. సత్యదేవ్ హీరోగా వచ్చే ఏడాది దర్శకుడిగా సినిమా తీయనున్నారు.
ఆత్మకూరు నుంచి హైదరాబాద్‌కు
జిల్లాలోని ఆత్మకూరుకు చెందిన నెట్టూరు నజీర్ ఎనిమిదేళ్లుగా సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇతను చిన్ననాటి నుంచే సంగీతంపై అభిమానం పెంచుకున్నారు. సంగీతంపై ఆసక్తితో ఎస్వీ, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాల్లో సంగీతం విద్యను అభ్యసించారు. విశ్వవిద్యాలయాల స్థాయి నుంచే సాంస్కృతిక, జానపద, ప్రభుత్వ కార్యక్రమాలకు నేపథ్యగానంతో పాటు, స్వరాలు సమకూర్చారు. 2012లో ‘యాంబిషన్’ అనే చిత్రంలో తెలుగు సినిమాలకు సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశారు. 2015లో ‘చదువు’ అనే లఘుచిత్రానికి గాను ఇంటర్నేషనల్ ఫిలిమ్‌ఫెస్టివల్‌లో ఉత్తమ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు. పెళ్లిచూపులు, కక్ష్య, టెక్‌ఇండియా షార్ట్‌ఫిల్మ్‌లకు సంగీతం అందించారు. శంఖిని, అమ్మకోసం, మెరుపు కళల జగం, క్యూబైత్రీ సినిమాలకు సంగీత స్వరాలు సమకూర్చారు. సైకో శంకర్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.
ఇదీ చదవండి :