అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు తొలిరోజు క్షణం తీరక లేకుండా గడిపారు. తొలుత జిల్లా నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. వైకాపా కక్ష సాధింపులకు భయపడొద్దని శ్రేణులకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జగన్ పరిపాలన దారుణంగా ఉందన్న ఆయన... 640మంది కార్యకర్తలపై కేసులు పెట్టారని మండిపడ్డారు.
సర్వ సభ్య సమావేశంలో మాజీఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు హయాంలో శాంతి... శాంతి అంటూ కాలం గడిపారని ... అది తమకు శాపంగా మారిందన్నారు. ఎన్నికల ముందు తమ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వొద్దని తానే చెప్పానన్న జేసీ... ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేలు తీరు చూస్తుంటే వారు వందరెట్లు మేలన్నారు. చంద్రబాబు వైఖరి మార్చుకోవాలని జేసీ హితవు పలికారు.
ఉరవకొండ నుంచి మూడుసార్లు గెలుపొందిన పయ్యావుల కేశవ్‌కు పార్టీ అన్యాయం చేసిందంటూ... కార్యకర్తలు చంద్రబాబు ఎదుట వాపోయారు. ఇది వాస్తవమని, సమన్యాయం చేసే విషయంలో కేశవ్‌కు అన్యాయం జరిగిందని చంద్రబాబు అన్నారు. అనంతపురం పార్లమెంట్ స్థానంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలో జేసీ పవన్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే జగన్ ఆకర్షించే పథకాలు ప్రకటిస్తున్నారని... పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక అన్ని అటకెక్కిస్తారని పవన్ విమర్శించారు.
ఒక్కో మండలంలోని ప్రతీపంచాయతీ పరిధిలోని మజరా గ్రామాల్లో తెదేపాకు వచ్చిన ఓట్లపై సూక్ష్మస్థాయిలో సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయి కార్యకర్తలు విభేదాలతో ఒకరిపైఒకరు చంద్రబాబు ఎదుటే ఆరోపణలు చేసుకున్నారు. వారి గ్రామాల్లో తెదేపాకు ఎన్ని ఓట్లు వచ్చాయని గణాంకాలతో చెప్పి, పార్టీ ఓటమికి, మెజారిటీ రాకుండా చేశారని చంద్రబాబు నిలదీశారు. ఉరవకొండ, గుంతకల్లు, కదిరి నియోజకవర్గాల కార్యకర్తలు ఎలాంటి సంకోచం లేకుండా పార్టీ ఓటమికి కారణాలను చంద్రబాబు ఎదుట కుండబద్దలు కొట్టారు.
అందరూ విభేదాలు వీడి పనిచేయాలని... గతంలో గుర్తింపునకు నోచుకోని వారందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీఇచ్చారు. పనిచేసే వారిని గుర్తించే విషయంలో పార్టీ ధోరణి మారాలని కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు చంద్రబాబుకు చెప్పారు. గతంలో ఎక్కువ సమయం పరిపాలన కోసం కేటాయించానని... కార్యకర్తలకు తగినంత సమయం ఇవ్వలేకపోవడం బాధ కల్గించిందన్నారు. గురువారం వైకాపా బాధిత కుటుంబాలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. దీనితో రెండోరోజు కార్యక్రమాలు మొదలవుతాయి. పెనుకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఇదీ చదవండీ...