TDP Chief Chandrababu Rayadurgam Visit Updates: ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభించారు. తొలి దశలో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. పల్లేపల్లిలో వేరుశనగ పంటను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై, వ్యవసాయశాఖ పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Chandrababu Nayudu Comments: ''వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చాక (జగన్ పాలన) రైతులకు రాయితీలు తీసేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకుంటామని భరోసా ఇస్తున్నా. టీడీపీ ప్రభుత్వ హయంలో రైతులందరికీ బీమా పరిహారం ఇచ్చాం. పంట నష్టపోయిన రైతులకు బీమాతో పాటు ఇన్‌పుట్ రాయితీలు ఇచ్చాం. రైతులకు ఏ సమస్య వచ్చినా.. ఆనాడు అన్ని విధాలా ఆదుకున్నాం'' అని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.
Chandrababu Harsh Comments on CM Jagan: జగన్ ప్రభుత్వం.. పెట్టుబడి రాయితీలు ఇస్తామని రైతులను మోసగించిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట బీమా పథకాన్ని తీసుకువచ్చి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గోదావరి జలాలను రాయలసీమకు తేవాలని తాను ప్రయత్నం చేస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో సాగునీటి కోసం రూ.69 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాయలసీమకు రూ.22 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. జగన్ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టిందని చంద్రబాబు నాయుడు వివరించారు.
Chandrababu on Kia Industry: టీడీపీ హయాంలో గొల్లపల్లి పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకువచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఉంటే.. సీమకు నీళ్లు ఇచ్చేవాళ్లమన్నారు. జగన్ ప్రభుత్వం.. రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేసిందన్న చంద్రబాబు.. రాష్ట్రంలో 34 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కరవు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన గుర్తు చేశారు. రాయలసీమలో 90 శాతం రాయితీతో మైక్రో ఇరిగేషన్ తీసుకువచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.
''వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మూతపడింది. ఈ వైసీపీ హయాంలో వ్యవసాయం వెంటిలేటర్‌పై ఉంది. టీడీపీ వచ్చాక రైతును రాజును చేసే బాధ్యత తీసుకుంటాం. వ్యవసాయ శాఖ ద్వారా రైతన్నను కావాల్సిన అవసరాన్ని గుర్తించి..రాయితీలు ఇస్తాం.''- చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
NTR Statue Unveiled in Ballary: రాయదుర్గం పర్యటనకు ముందు చంద్రబాబు నాయుడు బళ్లారిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బళ్లారిలో తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతింటోందని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తెలుగువారి శక్తి ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం గర్వకారణమన్నారు.
Minister Nagendra comments: ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక మంత్రి నాగేంద్ర నాగేంద్ర మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని కొనియాడారు. చంద్రబాబు నుంచి చాలా మంది సీఎంలు చాలా నేర్చుకున్నారని కర్ణాటక మంత్రి నాగేంద్ర గుర్తు చేశారు. ఏపీలో చంద్రబాబు మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.