CBI on Social Media Case: న్యాయవ్యవస్థతోపాటు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టుల ఆరోపణలపై నమోదైన కేసుల్లో ఆరుగురిని సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో సీబీఐ దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం పలువురి ఇళ్లలో అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం 21 వార్డు వైకాపా కౌన్సిలర్ మారుతీరెడ్డి నివాసంతో పాటు.. ఓ పార్టీ సామాజిక మాధ్యమ విభాగం కార్యాలయంలోనూ సోదాలు చేసినట్లు సమాచారం. పార్టీ సామాజిక మాధ్యమ విభాగంతో అనుబంధం ఉన్న, అక్కడ పనిచేస్తున్న కొంతమంది వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు.
న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ, వారిని అసభ్యకరంగా దూషిస్తూ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పెట్టిన పోస్టుల గురించి ప్రశ్నించి వివరాలు రాబట్టారు. ఇప్పటికే వారంతా ఆయా పోస్టులు తొలగించడంతో వాటి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ సేకరించేందుకు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మారుతీరెడ్డి నివాసంలో అయిదుగురు సీబీఐ అధికారులు సుమారు 12 గంటల పాటు సోదాలు చేశారు. మారుతీరెడ్డితో పాటు పలువురి నుంచి వివిధ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. తాము పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. అయితే.. న్యాయవ్యవస్థపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వైకాపా నాయకుడు మారుతీరెడ్డి అన్నారు.
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదుతో..
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారంటూ... గతంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2020 ఏప్రిల్ 16వ తేదీ నుంచి జులై 17వ తేదీ వరకు సీఐడీలోని సైబర్ నేరాల విభాగం మొత్తం 12 కేసులు నమోదు చేసింది. ఆయా కేసుల్లో 16 మందిని నిందితులుగా పేర్కొంది.
హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది నవంబర్ 11న ఈ కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీబీఐ చేపట్టింది. స్వభావం రీత్యా ఈ 12 కేసులు ఒకే తరహాలో ఉన్నందున... వాటన్నింటిపై ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేసి 16 మందిని నిందితులుగా చేర్చింది. 17వ నిందితుడి స్థానంలో వివరాలు తెలియని వ్యక్తి అని పేర్కొంది. వారిలో పలువుర్ని ఇప్పటికే అరెస్టు చేసి 11 అభియోగపత్రాలు దాఖలు చేసింది. సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు దురుద్దేశాలు, కులాలు, అవినీతి ఆరోపణలు ఆపాదిస్తూ... వారి ప్రాణాలకు హాని కలిగిస్తామని బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనేది వీరందరిపైనా ప్రధాన అభియోగం.