అనంతపురం జిల్లా కేపీ దొడ్డిలో మైనర్లను చితకబాదిన గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్పను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. అతడ్ని రిమాండ్కు తరలించనున్నట్లు వెల్లడించారు. బాలికతో శారీరకంగా కలిశాడన్న ఆరోపణలతో బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేపీ దొడ్డిలో డీఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్ వెంకటచలపతి, ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులతో మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. బాలికను కొట్టే సమయంలో రచ్చబండపై ఉన్నవారిని కూడా విచారించి వారిపైనా కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.
మరోవైపు బాధితురాలికి న్యాయం జరగాలంటూ ఇవాళ వివిధ దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దళితులపై ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి