బ్లాక్ ఫంగస్ లక్షణాలతో.. అనంతపురం సర్వజనాస్పత్రిలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా.. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన వారిని ఇక్కడికే తరలిస్తున్నారు. కేసుల సంఖ్యకు తగ్గట్లు మందులు లేనందున తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫంగస్ లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. అధికారులు కేసుల్ని కప్పిపుచ్చుతూనే వైద్యం చేస్తూ మందులు వాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా మంది ఫంగస్ బాధితులను బంధువులు.. బెంగళూరులోని ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి దాదాపు 70 మంది వరకు రోగులు బెంగళూరుకు వెళ్లినట్లు సమాచారం. జిల్లాలో ఫంగస్ లక్షణాలున్న వారు మాత్రమే ఉన్నారని.. వ్యాధి నిర్ధరణ కాలేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసుల్ని అధికారులు బహిర్గతం చేయడం లేదని.. ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 64 మందిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించినట్లు ప్రభుత్వాసుపత్రి వైద్యులు చెబుతున్నారు. పరిస్థితి విషమించిన వారికి యాంపోటెరిసిన్-బి ఇంజక్షన్లు వాడుతున్నారు. ఈ సూది మందు 21 రోజులు క్రమం తప్పకుండా వాడాల్సి ఉండగా, ఇంజక్షన్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ఫంగస్ రోగుల చికిత్స కోసం వైద్యులతో బృందాలను ఏర్పాటు చేసినట్లు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
బ్లాక్ ఫంగస్ లక్షణాలున్న వారు పెరుగుతుండటంతో.. అధికారులు.. అవసరమైన చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వార్డుల్లో రోగుల సంఖ్యను తగ్గించి, పడకలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: 'కిష్కింధలోనే ఆంజనేయుడు పుట్టాడు'.. 'కాదు..తిరుగిరుల్లోని అంజనాద్రిలోనే'