వాహనాల తనిఖీల్లో భాగంగా ఒక ద్విచక్రవాహనానికి సంబంధించి చలానా... 19 బైక్ల దొంగను పట్టిచ్చింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... బెళుగుప్ప మండలంలోని రమణేపల్లి వద్ద ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొద్దిరోజుల కిందట వాహనాల తనిఖీ చేశారు. కుందిర్పి మండలం బోదపల్లి గ్రామానికి చెందిన పాతన్న అనేవ్యక్తి ప్రయాణిస్తున్న వాహనానికి రూ.135 జరిమానా విధిస్తూ చలానా రాశారు. అయితే ద్విచక్రవాహనం అసలు యాజమాని చరవాణికి సంక్షిప్త సందేశం వెళ్లింది. అతడు వెంటనే పోలీసులను సంప్రదించారు.
పోలీసులు పాతన్నను అదుపులోకి తీసుకొని విచారించగా తీగలాగితే డొంక కదిలినట్లు.. మొత్తం 19 ద్విచక్రవాహనాలను దొంగతనం చేసినట్లు తేలింది. వాటిని స్వాధీనం చేసుకొని పరిశీలించగా... ఆంధ్రా రిజిస్ట్రేషన్లకు చెందిన ద్విచక్ర వాహనాలు 17, కర్ణాటకకు చెందినవి 2 ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై శ్రీనివాస్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇదీ చదవండి: అమరావతి కరకట్ట వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తెదేపా నేతల అరెస్టు