పప్పుశనగ సాగు చేయవద్దు.. ధరలు లేక నష్టపోతారు అంటూ వ్యవసాయ శాఖ అధికారులు అనంతపురం జిల్లా గ్రామాల్లో పర్యటిస్తూ.. రైతులకు సూచిస్తున్నారు. ఈసారి పప్పుశనగ పంటను 30 శాతం విస్తీర్ణం తగ్గించటమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ గ్రామాల్లో పర్యటిస్తోంది. ఈసారి రబీలో పప్పుశనగకు ప్రత్యామ్నాయంగా జొన్న, రాగి, కుసుమ, కొత్తిమీర వంటి తొమ్మిది పంటలను సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు.
- వద్దు అనటానికి ఇదే కారణమా?
ఇప్పటికే వర్షాలు పుష్కలంగా వర్షాలు కురిసి, వాతావరణం పప్పుశనగ సాగుకు అనుకూలంగా ఉన్నా.. వ్యవసాయ శాఖ రాయితీ పప్పుశనగను పంపిణీ చేయలేకపోతోంది. నేటికీ పప్పుశనగ రాయితీ ధరను నిర్ణయించకపోవటంతో.. అన్నదాతలు విత్తనం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ఆయా విత్తనాలకు మాత్రం రాయితీ ఇవ్వటం లేదు.
- నల్లరేగడిలో ప్రధానంగా వేసేది పప్పుశనగ పంటే!
రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలో రబీ సీజన్లో నల్లరేగడి భూముల్లో ఎక్కువుగా పప్పుశనగను సాగు చేస్తున్నారు. వర్షాధార భూముల్లో రైతులు, కేవలం పప్పుశనగను మాత్రమే పండించి.. మిగిలిన కాలమంతా భూమిని ఖాళీగా ఉంచుతారు.
- అధికారులే వద్దంటున్నారు..
పంటకు వచ్చిన ధరలు చాలని భావించే రైతులకు.. పంటను సాగుచేయకపోతేనే మంచిదంటూ ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా ప్రచారం చేస్తోంది. అనంతపురం జిల్లాలో ఏటా 98 వేల హెక్టార్లలో పప్పుశనగ సాగుచేస్తున్నారు. ఈసారి దీన్ని 75 వేల హెక్టార్లకే పరిమితం చేయాలని వ్యవసాయశాఖ అధికారులు కృషి చేస్తున్నారు.
- ఆ ధరే ఇస్తారా: రైతులు
పప్పుశనగకు బదులుగా ఇతర పంటలు వేయాలని అధికారులు చెప్తున్నా.. ఏళ్ల తరబడి ఈ పంటను సాగు చేస్తున్న నల్లరేగడి భూముల రైతులు మాత్రం, ఆ పంటకు సమానంగా ఆదాయం ఇస్తారా ప్రశ్నిస్తున్నారు.
- ఆలస్యం చేస్తే అన్నదాతకు నష్టమే..
వ్యవసాయ శాఖ వద్దని చెబుతున్నప్పటికీ.. పప్పుశనగ తప్ప వేరే పంట వేయలేము. ఇప్పటికీ విత్తనం ఇవ్వలేదు. ఆలస్యంగా సాగు చేస్తే.. చీడ, పీడలు ఆశించి పంట నాశనం అవుతుంది. ప్రభుత్వం తరగా విత్తనాలు సరఫరా చేయాలి.- ఓ రైతు
పప్పుశనగ క్వింటా 5,100 రూపాయల మద్దతు ప్రకటించటం సంతోషమే కానీ.. సాగు చేసిన పంటలో 30 శాతం మాత్రమే కొనుగోలు చేయటం ఎంతవరకు సబబు?- ఓ రైతు.
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని అనుకుంటున్నాం. గత సంవత్సరం పండించిన పంట కోల్డ్ స్టోరేజీల్లో ఉండిపోవటం.. పంట అమ్ముడు కాకపోవటంతో రైతు నష్టపోయాడు. ఈసారి ఆ విధంగా జరగకుండా ఉండేందుకే ప్రత్యామ్నాయ పంటలను సూచిస్తున్నాం.- వ్యవసాయ శాఖ అధికారి
ఇదీ చదవండి: