వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికి వైకాపా, తెదేపాలు రైతు వ్యతిరేక పార్టీలుగా మిగిలిపోయాయని ఏపీసీపీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. ఆ రెండు పార్టీలు భాజపాతో కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. అనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో శైలజానాథ్ పాల్గొన్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చి రైతుల గుండెల్లో గుణపాలు గుచ్చారని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. ఇంకా విద్యుత్ సంస్కరణల బిల్లును కేంద్రం తీసుకురాకముందే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని శైలజనాథ్ స్పష్టం చేశారు.
మరోవైపు వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. పొలాల్లో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయటంతో పాటు రైతుల రుణాలు రద్దు చేయాలన్నారు. కొత్తగా పంటలు వేసుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.