Volunteer Gambled with Pension Money: వృద్ధులకు ఇవ్వాల్సిన పింఛను డబ్బుతో జూదమాడి.. ఆ డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించి ఎత్తుకెళ్లినట్లు ఓ వాలంటీర్ కట్టుకథ అల్లి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని విడపనకల్లులో వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది.. జిల్లాలోని విడపనకల్లుకు చెందిన గ్రామ వాలంటీర్.. ఈ నెల పింఛన్ ఇవ్వడానికి అధికారుల నుంచి 89 వేల రూపాయలు తీసుకున్నాడు. ఆ నగదుతో కర్నూలు జిల్లా గుమ్మనూరు సమీపంలోని జూద శిబిరంలో మంగాపత్త ఆడాడు. ఆటలో పింఛన్ డబ్బుతో పాటు బంగారు ఉంగరం, సెల్‌ఫోన్‌ని పోగుట్టుకున్నాడు. అయితే ఈ విషయం బయట పడకుండా ఉండేందుకు వాలంటీర్ ఓ కట్టుకథ అల్లాడు.
- Volunteer Rude Behavior with BLO: వాలంటీర్ దౌర్జన్యం.. బీఎల్వో చేతిలోని ఓటర్ల జాబితాను లాగేసుకుని..
పింఛన్లు ఇవ్వడానికి వెళుతున్న సమయంలో జాతీయ రహదారిపై ఇద్దరు వ్యక్తులు తనను ఆపి.. 20వేల రూపాయల నగదు ఇస్తే ఆ మొత్తాన్ని ఫోన్ పే ద్వారా తిరిగి చెల్లిస్తామని చెప్పినట్లు, అయితే దీనికిగాను రూ.1,000కి.. 10 రూపాయలు కమీషన్ ఇవ్వాలని అతడు వారిని కోరినట్లు వాలంటీర్ చెప్పుకొచ్చాడు. అందుకు అంగీకరించిన ఆ వ్యక్తులు కర్ణాటక సరిహద్దులోని ఓ గ్రామానికి తీసుకెళ్లి బెదిరించి నగదుతో పాటు ఉంగరం, సెల్ ఫోన్ లాక్కెళ్లారని ఈ నెల 1వ తేదీన తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాలంటీర్ ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు వాలంటీర్‌ను విచారించగా.. అసలు విషయం బయటపడింది. అయితే ఈ విషయం బయటకు రాకుండా పోలీసులపై రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై స్థానిక ఎంపీడీవోని వివరణ కోరగా.. సర్వర్ బిజీగా ఉండడంతో రెండవ తేదీ పింఛన్ పంపిణీ చేసినట్లు సదరు వాలంటీర్ చెప్పాడని తెలిపారు. ఘటనపై పూర్తిగా విచారించిన అనంతరం వాలంటీర్ తప్పు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాని ఆయన వివరించారు.
"వాలంటీర్ క్లస్టర్‌కు సంబంధించిన 89 వేల రూపాయలను మేము ఇచ్చాము. నగదును కూడా పింఛన్‌దారులకు పంపిణీ చేయటం జరిగింది. అయితే వెలుగులోకి వచ్చిన ఘటనపై మేము పరిశీలనలు చేపట్టాము. దీనికి సంబంధించిన వివరాలపై సెక్రటరీని రిపోర్టు పంపించమన్నాము. సర్వర్ బిజీగా ఉండడంతో రెండవ తేదీ పింఛన్ పంపిణీ చేసినట్లు మాకు సమాచారం అందింది. ప్రతి నెలా సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.. అయితే కొన్ని గంటలకు అది నార్మల్ అయిపోతుంది. ఈ ఘటనపై పూర్తిగా విచారించిన అనంతరం వాలంటీర్ తప్పు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము." - శ్రీనివాసులు, ఎంపీడీవో