Ananthapuram Government Medical College: వారంతా వైద్య విద్యపై మక్కువతో కష్టపడి చదివారు.. సీనియర్ల సూచనలు, ఆచార్యుల మార్గదర్శకంతో ఉత్తమ మార్కులు సాధించారు. అన్నింటా ప్రతిభ చాటి బంగారు పతకాలకు ఎంపికయ్యారు.. తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు.. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.. ప్రభుత్వ వైద్య కళాశాల 2016 బ్యాచ్ విద్యార్థులు వైద్య విద్య పూర్తి చేసుకున్నారు. మంగళవారం 17వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. వంద మంది డిగ్రీ పట్టా పొందనున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో ప్రతిభ చాటిన తుది సంవత్సరం వైద్య విద్యార్థుల గురించి వారి మాటల్లోనే..
ఎన్‌ఎస్‌ఎస్‌లో ముందడుగు: జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్)లో చురుగ్గా పాల్గొన్నా. డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం బెస్ట్ ఫిమేల్ వాలంటీరు అవార్డును 2020-21 సంవత్సరానికి, 2019-20 ఏడాదికి ప్రభుత్వ వైద్య కళాశాల ఉత్తమ మహిళా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీరుగా అవార్డు సాధించా. హిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్ బిహారి వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంట్‌నీరింగ్ అండ్ వాటర్ స్పోర్ట్స్‌లో జాతీయ సాహస శిబిరంలో 2018లోనూ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నా. అక్కడి ప్రజల స్థితిగతులను తెలుసుకోగలిగా. - వరలక్ష్మి
ఆచార్యుల మార్గదర్శకం: ఆచార్యుల మార్గదర్శకంతోనే బంగారు పతకాలను సాధించా. కోర్సు పూర్తయ్యేలోగా 4 బంగారు పతకాలు దక్కాయి. మొదటి సంవత్సరంలో అనాటమీ, రెండో ఏడాదిలో డిటెన్షన్, మూడో సంవత్సరం డిటెన్షన్‌తోపాటు ఈఎన్‌టీ విభాగం, నాలుగో ఏడాది జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలో ప్రతిభ చూపినందుకు పతకాలు దక్కాయి. ఎంబీబీఎస్‌లో చేరిన కొత్తలో ఒత్తిడికి గురయ్యా. తల్లిదండ్రులు సీఎం అతావుల్లా, నూర్సత్‌కు మంచి పేరు తేవాలని సంకల్పించా. సీనియర్ల సలహాలు, ఆచార్యుల సహకారంతో మంచి మార్కులు సాధించా. - అయేషా తస్నీమ్
ఆరు బంగారు పతకాలు: నాది కర్నూలు జిల్లా. నాన్న రెహమాన్ ఇంజినీరు, అమ్మ నయీమున్నీసాబేగం గృహిణి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వైద్య విద్యలో రాణించా. పలు పుస్తకాల పఠనంతో ప్రతిభ కనబరిచా. ఫిజియాలజీ, పెథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్‌లో 6 బంగారు పతకాలు వచ్చాయి. బెస్ట్ ఔట్ గోయింగ్ స్టూడెంట్స్‌గా నిలిచా. అమ్మ ప్రోత్సహించింది. - మొహమ్మద్ ముజామిల్
ఏరోజుకారోజే చదవాలి: ఏ రోజు పాఠాలను ఆ రోజే చదివే వాడిని. నిత్యం కనీసం 3 గంటల పాటు చదవడానికి సమయం కేటాయించా. కోర్సు పూర్తి అయ్యేలోగా ఫార్మకాలజీ, ఆప్తమాలజీలో రెండు బంగారు పతకాలు సాధించా. నాన్న సుదర్శన్‌బాబు ఎస్‌బీఐలో పని చేస్తున్నారు. చిన్నప్పట్నుంచి కష్టపడి చదవడం నేర్చుకున్నా. డ్రాయింగ్, మ్యూజిక్ పోటీల్లో పిన్న వయసులోనే బహుమతులు అందుకున్నా. వైద్య విద్య పరీక్షల్లోనూ డ్రాయింగ్ బాగా వేయడంతోనే మంచి మార్కులు వచ్చాయి. కార్డియాలజీలో పీజీ పూర్తి చేసి, సమాజ సేవ చేయాలనే దృఢ సంకల్పంతో విద్యను కొనసాగిస్తున్నా. - అభిరామ్
క్రీడాకారుడిగా గుర్తింపు: వైద్య కళాశాల నుంచి మూడు పర్యాయాలు జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు ఎంపికయ్యా. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం నుంచి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన ఏకైక విద్యార్థిగా గౌరవం లభించింది. ఆచార్యులు విద్యతోపాటు క్రీడలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. 2016లో దక్షిణ భారత దేశ పోటీల్లో తమిళనాడు, 2017లో కేఎల్ విశ్వవిద్యాలయం, విజయవాడలోనూ పోటీల్లో పాల్గొన్నా. -పరీక్షిత్
ఇదీ చదవండి : 'ప్రకృతి సాగుకు పాధ్యాన్యమివ్వాలి.. ఆ రైతులకు రివార్డులివ్వాలి'