అధిక విద్యుత్ ఛార్జీలపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెదేపా నేతలు దీక్షకు దిగారు. ధర్మవరంలో పార్టీ సీనియర్ నాయకులు కాటమయ్య నిరసన చేపట్టారు. 3 నెలల బిల్లులు రద్దు చేయాలని కోరారు.
గుంతకల్లులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంప్ కార్యాలయంలో నిరసన చేపట్టారు. లాక్ డౌన్ వలన పనుల్లేక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే... ప్రభుత్వం కరెంటు శ్లాబులు మార్చి, ఛార్జీలు పెంచడం అన్యాయమన్నారు. పాత శ్లాబు విధానంలో విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పేదలకు ఒక చేత్తో ఇస్తూ... 2 చేతులతో లాక్కుంటోందని కదిరి తెదేపా ఇంఛార్జి కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రిలే దీక్ష చేపట్టారు. లాక్ డౌన్ ప్రజలు కోరుకున్నది కాదని, వారి క్షేమం కోసం ప్రభుత్వం విధించిందన్నారు. ఇళ్లకే పరిమితమైన ప్రజల అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని.. ఇలాంటి పరిస్థితుల్లో అడ్డదారిన విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపడం తగదన్నారు.
బొమ్మనహాళ్ మండలంలోని ఉప్పరహాల్ క్రాస్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ప్రజలు అల్లాడుతున్న సమయంలో.. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరవడం దారుణమన్నారు. కరెంట్ బిల్లులు తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
కరోనా కంటే కరెంటు ఛార్జీలే కన్నీరు పెట్టిస్తున్నాయని తెదేపా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిరలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న నిరసన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వారిపై ఛార్జీల భారం మోపుతోందని విమర్శించారు.
పెంచిన కరెంటు ఛార్జీలకు నిరసనగా దివ్యాంగుడు దీక్ష చేపట్టారు. మడకశిర పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, దివ్యాంగుడు అయిన రంగనాథ్ అనే యువకుడు పెంచిన కరెంటు ఛార్జీలకు నిరసనగా తన నివాసంలో నిరసన వ్యక్తం చేశాడు. బిల్లులు రద్దు చేయాలని కోరాడు.
ఇవీ చదవండి... 'పాడా'పై సీఎం జగన్ సమీక్ష..అభివృద్ధి పనులపై చర్చ