అనంతపురం జిల్లా గుమ్మఘట్టకు చెందిన అబ్దుల్ రవూఫ్.. పౌరసరఫరాల శాఖలో క్వాలిటీ కంట్రోలర్‌గా పనిచేశారు. ఉద్యోగ రీత్యా అనంతపురంలోనే స్థిరపడ్డారు. 2010లో పదవీ విరమణ పొందిన ఆయన.. వ్యవసాయంపై మక్కువతో 6ఎకరాల పొలం కొనుగోలు చేసి సేద్యం ప్రారంభించారు. మొదట్లో కళింగర, కర్బూజా, దోస పంటలు సాగు చేశారు. ఇప్పుడు 15 లక్షల రూపాయలు పెట్టుబడితో.. దానిమ్మ నర్సరీ ఏర్పాటుచేశారు.
దానిమ్మ మొక్కలు బలంగా, ఆరోగ్యంగా ఉండటం కోసం గాలి అంటు పద్ధతిలో మొక్కలను పెంచుతున్నారు. కర్నూలు జిల్లా డోన్ నుంచి ప్రత్యేకంగా కూలీలను రప్పించి అంట్లు కట్టిస్తున్నారు. మొక్కల పెంపకానికి సేంద్రియ పద్ధతిలో జీవామృతాన్ని వినియోగిస్తున్నట్లు రవూఫ్ చెబుతున్నారు.
అనంతపురం జిల్లాలో పండ్లు, కూరగాయ మొక్కల పెంపకం చేపట్టే రైతులకు.. 50 శాతం రాయితీ అందిస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ ఏడీ సతీశ్ చెబుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 8 యూనిట్లకు రాయితీ మంజూరు చేశామన్నారు.
గాలి అంటు నుంచి తయారైన మొక్కలు నాటడం వల్ల అధిక దిగుబడులు వస్తుండటంతో.. రవూఫ్ నర్సరీ మొక్కలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఏర్పడింది.
ఇదీ చదవండి: 55 ఏళ్లుగా ఒకే సైకిల్..ఎక్కడికెళ్లినా దానిపైనే !