అనంతపురం జిల్లా పెనుకొండ రెవెన్యూ డివిజన్లో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్నాయి. 13 మండలాల్లోని 184 గ్రామాల్లో.. 601 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 2,042 వార్డులకుగాను 260 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,782 వార్డుల్లో గెలుపు కోసం 3,981 మంది బరిలో ఉన్నారు. శాంతియుతంగా ప్రక్రియను ముగించడానికి పోలీసులు కార్యాచరణ రూపొందించారు. ముందస్తు జాగ్రత్తగా 562 కేంద్రాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐదు వేల మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ:
నాలుగో దశ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ గంధం చంద్రుడు పర్యవేక్షించారు. ఉపాధి కోసం జిల్లా నుంచి బెంగళూరు వెళ్లిన గ్రామీణ ఓటర్లను రప్పించినట్లు ఆయన తెలిపారు. 'ఫ్రెండ్లీ ఓటర్, ఫ్రెండ్లీ కంటెస్టెంట్, ఫ్రెండ్లీ ఎలక్షన్ ఆఫీసర్' అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్పీ సత్య ఏసుబాబు పర్యటించి ఎస్సై, సీఐ, డీఎస్పీలకు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని అభ్యర్థులు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సామగ్రి తరలింపు:
చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం గ్రామీణ మండలాల్లోని 38 పంచాయతీల్లో ఎన్నికల కోసం.. సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు చేరవేస్తున్నారు. విధుల కోసం కేటాయించిన దాదాపు 1,700 మందిని సామగ్రితో పాటు బస్సుల్లో తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 700 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. 444 పోలింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 6.30 నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: