Free Training For Young Women In Martial Arts : సమాజంలో మహిళలకు అనేక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి క్షేమంగా ఇల్లు చేరే వరకు కుటుంబ సభ్యులు ఆందోళనగా ఉంటున్నారు. అందుకే అనంతపురంకు చెందిన నాగరాజు అనే వ్యక్తి, తన కుమార్తెతో పాటు తమ్ముడి కుమార్తెను యుద్ధ విద్యలో తీర్చిదిద్దాలని భావించారు. వారికి చిన్ననాటి నుంచే కర్రసాము నేర్పాడు. వారికి ఇంకా శిక్షణ అవసరమని భావించిన నాగరాజు, తన శిష్యుడైన వన్నూరు స్వామి వద్ద కఠోర శిక్షణ ఇప్పించారు. ఫలితంగా పతకాలు సాధించడమే కాక పలువురికి కర్రసాము నేర్పుతున్నారు.
జాతీయ స్థాయిలో పతకాల పంట : అనంతపురానికి చెందిన వాణి, మౌనిక కర్రసాము సిస్టర్స్‌గా పేరు పొందారు. ఓ వైపు తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా గడుపుతూనే మరోవైపు పలువురికి ఉచిత కర్రసాము శిక్షణ ఇస్తున్నారు. ప్రాచీన కాలం నాటి కళను తమ గురువు వద్ద నుంచి నేర్చుకుని జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నారు. ఎమ్బీఏ పూర్తి చేసి సివిల్స్‌కి సన్నద్ధమవుతున్న మౌనిక ఈ శిక్షణ ఇవ్వడం వెనక కారణంతో పాటు తమ ప్రస్థానం సాగిన విధానం గురించి ఇలా చెబుతోంది.
విద్యార్థినులకు ఉచిత శిక్షణ : వాణి, మౌనిక తమ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటూనే అనంతపురంలోని కళాశాలలకు వెళ్లి కర్రసాముపై ఆసక్తి ఉన్న విద్యార్థినులను ఎంపిక చేసుకొని శిక్షణ ఇస్తున్నారు. అది కూడా ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థినులకే. ఈ కర్రసాము సిస్టర్స్ ఇప్పటికే వంద మందికి పైగా శిక్షణ ఇచ్చారు. కొందరిని తమతో పాటు జాతీయస్థాయి కర్రసాము పోటీలకు తీసుకెళుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉత్సవాలు జరిగినా వాణి, మౌనిక సిస్టర్స్‌కు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది.
ఆత్మస్థైర్యం : పలు రాష్ట్రాల్లో నిర్వహించే పోటీల్లోనూ ఈ కర్రసాము సిస్టర్స్ పాల్గొని తమ సత్తా చాటారు. ఎక్కడికెళ్లి పోటీల్లో పాల్గొన్నా అత్యంత ప్రతిభ కనబరిచి పతకంతో తిరిగివస్తూ అనంతపురం నగరంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి దగ్గర కర్రసాము నేర్చుకుంటున్న యువతులు ఈ శిక్షణతో తమలో ఆత్మస్థైర్యం పెరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అధైర్య చెందవద్దు : తన కుమార్తెలు ఎక్కడా అధైర్యానికి లోనుకాకూడదనుకునే వాణి, మౌనికకు కర్రసాములో మంచి శిక్షణ ఇప్పించినట్లు చెబుతున్నారు నాగరాజు.
కర్రసాము గుర్తించని ప్రభుత్వం : కర్రసాము అనేది సిలంభం అనే ప్రాచీన యుద్ధ క్రీడలో భాగమని చెబుతున్నాడు కర్రసాము శిక్షకుడు స్వామి. సిలంభం దేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మంచి పేరు పొందుతుందని అంటున్నారు. ఈ యుద్ధ విద్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్రసాము సిస్టర్స్ కృషి : ఇలా ఉచిత శిక్షణ ద్వారా మన సంప్రదాయ యుద్ధకళలను ముందు తరాలకు అందించడాని కి కూడా తమ వంతు కృషి చేస్తున్నారు కర్రసాము సిస్టర్స్ వాణి, మౌనిక.
"గత ఏడు సంవత్సారాలుగా కర్రసాము నేర్పిస్తున్నాము. 50 నుంచి 60 మంది పిల్లలుకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము. వారితో 50 సంవత్సరాలు ఉన్న వారు కూడా నేర్చుకోవడానికి వస్తున్నారు. కర్రసాము ద్వారా దిల్లీ వెళ్లి వచ్చాను. స్టేట్, నేషనల్ వైడ్ చాలా ప్రోగ్రామ్స్ చేశాము."- మౌనిక, కర్రసాము శిక్షకురాలు
"మా నాన్న గారు కర్రసాము మాకు నేర్పించారు. విద్య అనేది పది మందికి పంచాలనే ఉద్ధేశ్యంతో అందరికి నేర్పిస్తున్నాము. జాబ్ చేస్తూనే అమ్మాయిలకు కర్రసాము శిక్షణ ఇస్తున్నాను. ప్రభుత్వం కూడా మమల్నీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము."- వాణి, కర్రసాము శిక్షకురాలు
ఇవీ చదవండి