పేద కుటుంబం నుంచి వచ్చినవారు.. పేదలకు సహాయం చేయాలని భావించారు. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడినా.. సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపారు. అనంతపురం జిల్లాకు చెందిన జీవన్ సాగర్, రాకేష్, భాస్కర్, చైతన్య ఇలా కొంతమంది యువ ఇంజినీర్లు బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ... ఆపదలో ఉన్నవారికి సహాయం చేయదలిచారు. అనుకున్నదే తడవుగా సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్నారు. సోషల్ మీడియాలో సహాయం కావాలని వస్తున్న వీడియోలను, సమాచారాన్ని సేకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఐక్యంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
ఏకత్వ ఫౌండేషన్ పేరిట సేవలు..
2015లో అనంతపురం జిల్లాకు చెందిన కొంతమంది యువ ఇంజనీర్లు ఏకత్వ ఫౌండేషన్ ప్రారంభించారు. తమ తోటి మిత్రులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయదలచిన కార్యక్రమాలను వివరించారు. వీరంతా వారాంతపు సెలవులు అనంతపూర్కి వచ్చి... ఇక్కడ ఉన్న అనాధ, వృద్ధ, మానసిక దివ్యాంగుల ఆశ్రమాలను పరిశీలిస్తారు. అక్కడి ఉన్న పరిస్థితులను బట్టి వారికి సహాయం అవసరమైతే వెంటనే తమ మిత్రుల గ్రూపులో సమాచారాన్ని షేర్ చేస్తారు. మిత్రులను తమకు తోచిన సహాయం చేయాలని కోరుతారు. ఇలా సేకరించిన మొత్తాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశ్రమాలకు కావలసిన నిత్యావసర సరుకులు, పండ్లు, దుస్తులు ఇతర వసతులు కల్పనకు కృషి చేస్తారు.
వృద్ధులు, పిల్లల కోసం షెడ్డు..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలోని పాత భవనాలు కుప్పకూలాయి. కొన్నిచోట్ల ఇళ్లు, ఆశ్రమాలు మరమ్మత్తులకు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఘటనే రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ప్రసన్నాయపల్లిలో ఉన్న ''గురు రాఘవేంద్ర'' అనాథ వృద్ధాశ్రమంలో చోటు చేసుకుంది. వర్షం వచ్చినప్పుడల్లా అక్కడున్న వృద్ధులు, పిల్లలు జాగారం చేయాల్సిన దుస్థితి.. ఈ పరిస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా చూసిన ఫౌండేషన్ మిత్రులు ఆశ్రమానికి వెళ్లి పరిశీలించి... రూ. 86 వేల నగదును సేకరించి ఆశ్రమంపై భాగంలో వర్షం వస్తే నీరు కారకుండా రేకులను ఏర్పాటు చేశారు. దీనిపై వృద్ధులు, అనాథ పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు.
వారం వారం.. సేవే మార్గం
వారాంతపు సెలవుల్లో జిల్లాలో ఉన్న ఆశ్రమాలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు సరుకులు అందిస్తున్నారు. పేదల ఆకలి తీర్చడానికి రోడ్డు పక్కన ఉన్న యాచకులకు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో రక్తదానం సైతం సభ్యులు చేస్తున్నామని చెప్పారు. యువ ఇంజనీర్లు చేస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: ఊహించని రీతిలో సివిల్స్ ప్రశ్నాపత్రం.. ఆశ్చర్యంలో అభ్యర్థులు