JC Prabhakar Reddy main follower Assassination attempt: అనంతపురం జిల్లాలో రోజురోజుకు అధికార పార్టీ నాయకుల అరాచకాలు పెరిగిపోతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, ఐటీడీపీ పట్టణాధ్యక్షుడు గండికోట కార్తీక్‌పై వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు గండికోట కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. తనపై దాడి చేసింది వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు రఫీ అలియాస్ అడ్డు రఫీ అని గండికోట కార్తీక్ ఆరోపించారు.
పూర్తి వివరాల్లోకెళ్తే.. కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న నెపంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, ఐటీడీపీ పట్టణాధ్యక్షుడు గండికోట కార్తీక్‌పై ఆదివారం అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. విధులు ముగించుకుని కార్తీక్.. ఇంటికి వెళ్తుండగా కొంతమంది యువకులు కర్రలతో, వేట కొడవళ్లతో హత్యాయత్నం చేశారు. దీంతో కార్తీక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తాను వెళ్తున్న మార్గంలో కాపు కాసి కత్తులు, కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపారు. తాడిపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు రఫీ ఈ దాడికి పాల్పడ్డారని కార్తీక్ ఆరోపించారు.
విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఈరోజు అనంతపురంలోని సవేరా హాస్పిటల్‌కు చేరుకుని కార్తీక్‌ను పరామర్శించారు. కార్తీక్‌కు మెరుగైన వైద్యం అందించడానికి హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని జేసీ పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థపైన ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందని, జిల్లాలో వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండాపోయిందని ఆయన మండిపడ్డారు. అనంతరం కార్తీక్ భార్య మాట్లాడుతూ..తన భర్తపై దాడి చేసిన వాళ్లని కఠినంగా శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఇవీ చదవండి