ఆగస్టు 19న బుక్కరాయ సముద్రంలో వెలుగు చూసిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ కేసును అనిశాకు బదిలీ చేశారు. శనివారం ఉదయం ట్రెజరీ విభాగం ఉద్యోగి మనోజ్ ను అదుపులోకి తీసుకొని ఓవైపు ప్రశ్నిస్తూనే, అతడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు ఐదు చోట్ల ముమ్మర సోదాలు నిర్వహించారు.
కర్నూలు నుంచి ఓ బృందాన్ని పిలిపించి 5 చోట్ల ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రెజరీ ఉద్యోగి మనోజ్ గతంలో పనిచేసిన కార్యాలయంలో విధులు నిర్వహించిన చోట దస్త్రాలను అనిశా అధికారులు పరిశీలిస్తున్నారు. మనోజ్ ఇంట్లో సోదాలు చేస్తూ అతని కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. రెండో బృందం అనంతపురంలోని మనోజ్ స్నేహితుడు నాగార్జున ఇంట్లో సోదాలు చేస్తున్నారు. మరో బృందం బక్కరాయ సముద్రంలో మనోజ్ వ్యక్తిగత డ్రైవర్ నాగలింగం ఇంట్లో మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. మరింత మంది అనుమానితులను బీకేఎస్ పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ చేస్తున్నారు.
గతంలో మనోజ్ వేధిస్తున్నాడని, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి, అతనికి దూరంగా ఉంటున్న భార్యను కూడా అనిశా అధికారులు ప్రశ్నిస్తూ, ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో డ్రైవర్ నాగలింగం ఇంట్లో స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలను బీకేఎస్ పోలీసులు, అనిశా అధికారులకు అప్పగించారు. మనోజ్ ను కర్నూలు అనిశా కోర్టులో హాజరుపరుస్తున్నట్లు అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: