Advocate Puttaparthi Prabhakar Reddy: ఏ పండగ వచ్చినా కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకోవడం అందరూ చేస్తుంటారు. అనంతపురంలోని సీనియర్ న్యాయవాది పుట్టపర్తి ప్రభాకర్ రెడ్డి కుటుంబం మాత్రం.. ఇందుకు భిన్నంగా ఆరేళ్లుగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తోంది. ప్రభాకర్‌రెడ్డి తన కుమార్తె, కుమారుడి వివాహాల్లో అనాథ పిల్లలనే ముఖ్య అతిథులుగా ఆహ్వానించి.. పెళ్లి మండపంలో ప్రత్యేకంగా వాళ్లకు గౌరవ మర్యాదలు చేశారు. అప్పటి నుంచి ఏటా నూతన సంవత్సర వేడుకలు చిన్నారుల మధ్యనే చేసుకుంటున్నారు.
అనాథ ఆశ్రమానికి వెళ్లి వేడుకలు జరిపితే ప్రత్యేకత ఉండదని భావించిన ఆ కుటుంబం.. 55 మంది చిన్నారులను ప్రత్యేక వాహనాల్లో తమ ఇంటికి తీసుకువచ్చి, వారితో నూతన సంవత్సరం రోజు కేకు కోయించి విందు భోజనం పెట్టి, వారికి అవసరమైన పాఠశాల బ్యాగులు, ఇతర వస్తువులను అందిస్తున్నారు. ఈ ఆనవాయితీని తెలుసుకున్న మహాలక్ష్మి టెక్స్‌టైల్స్, మునిరత్నం ట్రావెల్స్ యాజమాన్యం తమ వంతుగా పిల్లలకు దుప్పట్లు అందిస్తున్నారు.
ఏటా కార్యక్రమానికి కొంతమంది ప్రముఖులను ఆహ్వానించి.. వారి చేతుల మీదుగా పేద పిల్లలకు బహుమతులు ప్రదానం చేస్తున్నారు. అందరూ సమాజంలో కలిసిపోవాలని, అనాథలని ప్రత్యేకంగా చూడకూడదనే ఉద్దేశంతో.. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రభాకర్ రెడ్డి చెబుతున్నాన్నారు. పేద పిల్లలకు సహాయం చేసే కార్యక్రమాలను.. వీలైన ప్రతి ఒక్కరూ నిర్వహించాలని ప్రభాకర్‌రెడ్డి కోరుతున్నారు.
ఇవీ చదవండి: