అనంతపురం జిల్లా పరిగి మండలం సుబ్బరాయపల్లి గ్రామంలో ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు పాడుబడిన బావిలో పడిపోయింది. గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో పశుగ్రాసం సేకరించేందుకు ట్రాక్టర్ను తీసుకెళ్లారు. అయితే ఆ పొలంలో గడ్డి, పిచ్చిమొక్కలు భారీగా పేరుకుపోయి ఉన్నాయి. ఈ క్రమంలో పొలంలోని బావిని గమనించని డ్రైవర్.. ముందుకు వెళ్లగా ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా... మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంలో శివప్ప అనే వ్యక్తి కాళ్లు విరిగాయి. అతనిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బావిలో పడిన ట్రాక్టర్ను బయటకు తీశారు. ఆ వాహనం లేపాక్షి మండలం బసవన్న పల్లి గ్రామానికి చెందినదిగా గుర్తించారు.
ఈ ప్రమాదం జరిగిన కొంత దూరంలోని అలాంటి బావులు నాలుగు ఉన్నాయి. పొలాల్లో నీళ్లు లేక అనేక బావులు పాడుబడి ఉన్నందున ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతంలోనూ మనుషులు, పశువులు పడిపోవడం వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. అధికారులు స్పందించి.. నిరూపయోగంగా ఉన్నఈ లాంటి బావులను పూడ్చి వేయించాలి.- స్థానికులు
ఇదీ చదవండి: