అనుమానంతో వచ్చిన కలహాలకు ముగ్గురు చిన్నారులూ బలైపోయారు. తానూ కూడా చనిపోవాలనుకున్న ఆ తల్లికి.. ఇప్పుడు కడుపు కోతే మిగిలింది. ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమెకు.. ముగ్గురు కూతుళ్లు పెద్ద శిక్షే విధించి వెళ్లిపోయారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలోని పెద్దకమ్మవారి దొమ్మరకాలనీకి చెందిన గురుమూర్తి, రమణమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరి పెద్ద కుమార్తె అరుణమ్మను కదిరి పట్టణానికి చెందిన రమేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆటో నడుపుకొంటూ రమేశ్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి భవ్య(8), భార్గవి(8), చందన(5) కుమార్తెలు. ఎంతో సంతోషంగా ఉండే ఈ కుటుంబంలో అనుమానం పెనుభూతమై నాలుగు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. రమేశ్ స్నేహితుడి భార్య వచ్చి అరుణమ్మతో గొడవ పడింది. ఈ క్రమంలో అరుణమ్మ దొమ్మరకాలనీలోని తన పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో ఆవేదనకు గురై.. పిల్లలతో పాటు చావాలని నిర్ణయించుకుంది.
ఆదివారం సాయంత్రం.. పిల్లలకు చెరువు చూపిస్తానని చెప్పింది. వాళ్లు నిజమేనని నమ్మి తల్లి వెంట వెళ్లారు. ముందు పిల్లలను చెరువులోకి తోసేసింది అరుణ. తర్వాత తానూ.. దూకేసింది. ఇది గమనించిన స్థానికులు అరుణను కాపాడారు. భార్గవి అనే చిన్నారిని బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. మిగిలిన ఇద్దరు చిన్నారులను ఇవాళ బయటకు తీశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు మృతిచెందటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రామకృష్ణ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.