UNION MINISTER MURALEEDHARAN : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని కేంద్ర విదేశీ పార్లమెంటు వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో సహకారం అందడం లేదని వివరించారు. అమరావతి రాజధానికి భాజపా కట్టుబడి ఉందని తెలిపారు.
"ఏపీలో కేంద్రప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అమరావతి రాజధానికే భాజపా కట్టుబడి ఉంది. విశాఖలో రాజధాని పేరుతో భూ దోపిడీలు" -కేంద్రమంత్రి మురళీధరన్
విశాఖలో భూ దందాల కోసమే మూడు రాజధానులను వైకాపా నాయకులు తెరమీదకు తెచ్చారని వెల్లడించారు. విశాఖలో భూకబ్జాలకు భాజపా వ్యతిరేకమని.. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు. రాష్ట్ర రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ అమరావతిని రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కుటుంబ పార్టీలైన వైకాపా, తెదేపా పట్ల ప్రజలు విసుగు చెందారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపా మరింత బలోపేతం అవుతుందని వెల్లడించారు. బలమైన ప్రతిపక్ష పాత్రను రాష్ట్రంలో పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతిని ఎండగడతామని సూచించారు.
ఇవీ చదవండి: