Land encroachment in vissannapeta: అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలో.. విస్సన్నపేట శివారులో.. భూమి ఆక్రమణకు గురైందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఓ గృహనిర్మాణ సంస్థ ఇక్కడ భారీ ప్రాజెక్టుకు సన్నద్ధం కాగా... చాలా రోజుల క్రితమే ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. సుమారు 600 ఎకరాలలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. దీని కోసం అక్కడ ఉన్న మూడు అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును వందల అడుగులకు విస్తరించేలా కొండను పిండి చేశారని.. వ్యవసాయ అవసరాలు తీరుస్తున్న గెడ్డలను కప్పేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భవంతులు, విల్లాలు కట్టుకోవడం కోసం పచ్చని ప్రకృతిని పూర్తిగా నాశనం చేశారని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ భూమితోపాటు.. పేదలు, బలహీనవర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు ఉండేవని స్థానికులు తెలిపారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచరుడు, గవర కార్పొరేషన్ ఛైర్మన్ ప్రసాద్.. బెదిరించి.. భూములు కొనుగోలు చేశారని ఆరోపిస్తున్నారు. ఆ కొద్దిపాటి భూమితోపాటు కొండల్ని కలిపేసుకొని దారుణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విస్సన్నపేటలో ప్రకృతి విధ్వంసంపై ఇప్పటికే ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేదని... లోకాయుక్త సుమోటోగా ఈ వ్యవహారాన్ని తీసుకున్నా.. జిల్లా అధికారులు సమాధానం చెప్పలేదని విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆయన అనుచరులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: