Janasena leaders Protest in Anakapalli: అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విస్సన్నపేటలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. విల్లాల పేరుతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. మంత్రిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 600 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లేఔట్‌ల్లో ప్రభుత్వ భూములను, గెడ్డలను, కొండలను కలిపేసి.. మంత్రి గుడివాడ అమర్నాథ్, అతని అనుచరులు అక్రమాలకు
పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు గురువారం.. విస్సన్నపేటలోని లేఔట్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారాన్ని వినియోగించి.. డి పట్టా భూములను కబ్జా చేశారని ఆరోపించారు. లేఅవుట్‌ల్లోని కొండలను, ప్రభుత్వ భూమిని, గెడ్డలను ఆక్రమించి విల్లాల పేరుతో భారీ ప్లాన్ చేశారన్నారు. గతంలో ఈ లేఅవుట్‌పై ప్రభుత్వ అధికారులు నివేదికను తయారు చేశారని.. మూడు నెలలు గడవకముందే మంత్రి గుడివాడ అమర్నాథ్, అతని అనుచరులు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు.
ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా కాలయాపన చేస్తున్నారని.. లేఔట్‌ల్లో జరిగిన అవినీతిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు జనసేన పార్టీ తరఫున ప్రత్యక్ష, న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ జరిగిన భూ అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకొని.. ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడాలని, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్ మాట్లాడుతూ.. వింటేజ్ మౌంటెన్ విల్లాస్ రూపంలో రాష్ట్ర పరిశ్రామల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, అతని సహచరులందరూ ఒక భయంకరమైన స్కామ్‍కి స్కెచ్ వేసి.. గవర్నమెంట్ స్థలాలు, కొండలు, వాగులు, ఆసైన్డ్ స్థలాలు, మిగులు భూములు, డి పట్టా భూములు పొందిన పేదవారికి నోటిసులు ఇవ్వకుండా అన్నింటీని కలిపేసి.. అక్రమానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. లేఔట్‌కి నామరూపాలు లేకుండా చేసి.. మౌంట్ విల్లాస్‌ను నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి లేఔట్‌ను పరిశీలించమన్నారు. పేద ప్రజలకు న్యాయం జరిగేవరకూ జనసేన పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి