Petro versity: రాష్ట్రానికే తలమానికంగా ఉంటుందనుకున్న అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో ఎనర్జీ వర్సిటీ (ఐఐపీఈ) ఉత్తర్‌ప్రదేశ్‌కు తరలిపోతోందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఇప్పటికే ఈ దస్త్రం దిల్లీలో కదులుతున్నట్లు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. ‘అది నిజమైతే ఆరేళ్లుగా రాష్ట్ర విద్యార్థులు కన్న కలలన్నీ కల్లలుగానే మిగిలిపోతాయి.
సబ్బవరం మండలం వంగలిలో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు 2016లో 201 ఎకరాల భూమిని కేటాయించారు. రూ.వెయ్యి కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశారు. వర్సిటీ కోసం కేటాయించిన స్థలంలో 20 ఎకరాల భూమి విషయంలో తమకు న్యాయం జరగలేదని 25 మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణాలు నిలిచిపోయాయి.
ఐఐపీఈ అధికారులు యూనివర్సిటీని మరోచోట ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారని తెలిసింది’ అని సత్యనారాయణమూర్తి వెల్లడించారు. అనకాపల్లి కలెక్టర్ రైతులకు ఇచ్చిన గడువు పూర్తయినా.. వారు తమ నిర్ణయాన్ని వెల్లడించలేదని, దీంతో వర్సిటీ పరిస్థితి సందిగ్ధంలో పడిందన్నారు.