Meeting of Sarpanches: రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామ సర్పంచులను చులకనగా చూస్తున్నారని వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపుతామని ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని వైఎంవీఏ హాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో సర్పంచ్ సంఘ సభ్యుల సదస్సు జరిగింది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా తయారుచేసి స్థానిక సంస్థలను సీఎం జగన్ నిర్వీర్యం చేశారని వాపోయారు. గ్రామ సర్పంచులకు సమాంతర వ్యవస్థగా వాలంటీర్, సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి గ్రామాల్లో సర్పంచులకు విలువ లేకుండా చేశారన్నారు. 14,15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తుందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం 2022_23 ఆర్థిక సంవత్సరంకి రాష్ట్రంలోని 12,918 గ్రామపంచాయతీలు 2020 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఇప్పటివరకు గ్రామపంచాయతీకి ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అసలు ఆ నిధులు విడుదల చేసిందా లేదా విడుదల చేస్తే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలోనే దొంగలించిందా అన్నదానిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలు సర్పంచ్‌ల ఆధీనంలోకి గ్రామ సచివాలయాలను వాలంటీర్లను తీసుకురావాలన్నారు. సర్పంచులు గౌరవ వేతనం 15000, ఎంపీపీలు జడ్పీటీసీలు గౌరవ వేతనం 30000 చేయాలని డిమాండ్ చేశారు. తాము 12 డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపమని ఇందులో గౌరవ వేతనం కోసం ఉన్న డిమాండ్ తప్ప మిగిలినవన్నీ ప్రజల కోసమేనని వివరించారు.
గతంలో ముఖ్యమంత్రులైన వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థలకు ఇచ్చిన ప్రాధాన్యతని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవ్వాలని పేర్కొన్నారు రాష్ట్రంలోని 11,500 మంది వైసీపీ బలపరిచిన సర్పంచ్ లే ఎన్నికయ్యారని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తాము హామీలు ఇచ్చి గెలిచామని అవి నెరవేర్చకపోవడంతో ప్రజలు గ్రామాల్లో సర్పంచ్లను నిలదీస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చడానికి కూడా పంచాయతీలో నిధులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని... దీనికి తగిన గుణపాఠం త్వరలోనే చెబుతామని హెచ్చరించారు. నియోజకవర్గాల వారీగా గ్రామ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి ఛలో అమరావతి ఛలో డిల్లీ కార్యక్రమాలతో నిరసన చేపడుతామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: