AP Crime News : అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏటి గైరంపేట వద్ద ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న 20 కేజీల గంజాయిని గొలుగొండ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నానికి చెందిన ప్రైవేటు బస్సు రోజు నర్సీపట్నం నుంచి చింతపల్లి, గూడెం కొత్త వీధి, సీలేరు తదితర ప్రాంతాలు మీదుగా చిత్రకొండ వెళ్లి వస్తుంది. దీనిలో భాగంగానే ఈ నెల ఆరో తేదీ సాయంత్రం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమంగా సేకరించిన గంజాయిని నర్సీపట్నం తరలించేందుకు బస్సులో లోడ్ చేశారు. ఈ విషయం ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందడంతో వారు నిఘా ఉంచారు. ఏటి గైరంపేట వద్ద బస్సు ఆపి తనిఖీ చేయగా గంజాయిని గుర్తించారు. దీంతో బస్సు డ్రైవర్, కండక్టర్లతో పాటు దారకొండ ప్రాంతానికి చెందిన మరో ఇద్దర్ని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 12 వేల రూపాయలతో పాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
శనివారం అదృశ్యం.. ఆదివారం మృతి : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందింది. వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారు బావిలో బాలిక మృతదేహం లభ్యమైంది. మృతురాలు గ్రామానికి చెందిన తుంగ ప్రవళిక (15) గా పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం నుంచి బాలిక ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిందని బంధువులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టాటా ఏస్ వాహనం.. ఒకరు మృతి : ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామ శివారు వద్ద ఆర్అండ్బీ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో పరిటాల గ్రామానికి చెందిన ఖాదర్ మృతి చెందాడు. అతని కుమారుని పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిటాల నుంచి రేమిడిచర్ల వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతునికి ముగ్గురు కుమారులు ఉన్నారు.
చెరువులో గుర్తు తెలియని మృతదేహం : కృష్ణా జిల్లా పెదమద్దాలి పామర్రు మండలం పెదమద్దాలి చెరువులో గుర్తు తెలియని పురుషుని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి పోలీసులు తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పామర్రు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి