YSRCP MLA Bhagya Lakshmi: తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను జగన్ జనంలో తిరగమంటున్నారు. వారు ప్రజల మధ్యకు వెళ్తే జనాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. వెళ్లకపోతే జగన్ ఊరుకోవడం లేదు.. వెళ్తే ప్రజలు సమస్యలు ఏకరువు పెడుతున్నారు. అలాంటి పరిస్థితే అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి ఎదురైంది. ప్రజల మధ్యకు గడప గడప అంటూ వెళ్తే ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురైంది.
గ్రామస్థులు ప్రశ్నల వర్షం: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి గడపగడప కార్యక్రమంలో మరోసారి నిరసన సెగ తగిలింది. పాడేరు మండలం దిగుసొలములులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గడపగడపకు కార్యక్రమానికి వెళ్లారు. గ్రామస్థులు, వృద్ధుల పెన్షన్ తొలగింపుపై ఆమెను నిలదీశారు. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్న వ్యక్తిపై కరపత్రంతో చేయి చేసుకున్నారు. డ్వాక్రా రుణాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేయలేదంటూ గ్రామస్థులంతా ప్రశ్నించసాగారు. వారికి సరైన సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే ఇబ్బంది పడ్డారు. తమ సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్న ఓ యువకుడితో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అనుచరులు వాగ్వాదానికి దిగారు. అతనితో దురుసుగా ప్రవర్తించారు. పక్కకు నెట్టే ప్రయత్నం చేయడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు తెలుసుకుంటానని వచ్చిన ఎమ్మెల్యే.. ప్రశ్నలు అడుగుతుంటే ఇలా చేయి చేసుకోవడం ఏమిటని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
సమాదానం చెప్పలేక ఇబ్బంది పడ్డ ఎమ్మెల్యే: ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే ఆమె అనుచరులు నెట్టి వేయడం సరికాదంటున్నారు. అదే సమయంలో గ్రామంలో పెన్షన్ తీసేసిన వారు తమ సమస్యలను ఎమ్మెల్యే ముందుంచే ప్రయత్నం చేశారు. కొందరు యువకులు వృద్ధుల పెన్షన్ తీసేయడంపై ప్రశ్నించారు. ఎమ్మెల్యే తవ మాట వినాలి అంటూ.. ఎన్నిసార్లు నచ్చచెప్పినా గ్రామస్థులు ప్రశ్నల వర్షం కురిపించారు. తమ గ్రామానికి వైసీపీ నేతలు ఏమి చేశారంటూ నిలదీశారు. వారంతా మూకుమ్మడిగా తమ సమస్యలను ఏకరువు పెట్టడంతో, పెన్షన్ కోల్పోయిన వృద్ధుల వివరాలు తీసుకోవాలని వాలంటీర్, వీఆర్ఓకి చెప్పారు. వారికి తగిన న్యాయం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించడంతో కొంత సేపటి తరువాత అమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇవీ చదవండి: