Villagers of Alluri Sitaramaraju district are Pleading: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని.. ఆ గ్రామాలకు విద్యుత్ ఉండదు. గతంలో కొంత మంది అధికారులు వచ్చారు.. చూశారు. అంతే తరువాత మరి పట్టించుకోలేదు. వాళ్ల గ్రామాలకు కూడా విద్యుత్ అందలేదు. ఇక దీనికి తోడు.. వివిధ రకాల క్రూర జంతువులు.. తమ గ్రామాలలోనికి వస్తున్నాయి. దీంతో స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గ్రామాలలోకి జంతువులు వచ్చి.. పశువులపై దాడి చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.
ఇప్పటికే పలుమార్లు.. పులి.. పశువులను తినగా.. తాజాగా కొద్ది రోజుల నుంచి రాత్రి వేళల్లో గ్రామాలలోకి వచ్చి.. పశువులపై దాడి చేస్తుంది. ఒక పక్క పులితో భయపడుతూ బతుకుతున్న వారికి.. మరో వైపు విపరీతమైన చలి సవాలు విసురుతోంది. రాత్రి పూట గ్రామస్థులు చలి మంటలు వేసుకొని ఉంటుండగా.. పులి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో అని భయపడుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా శివారు అనంతగిరి మండలం రాపల్లి పంచాయతీ, ఎస్ఆర్ పురం పంచాయతీల ఐదు గ్రామాల కొండల్లో పులి సంచరిస్తుందనీ పశువులను సంరక్షించాలని ఆయా గ్రామస్థులు వేడుకుంటున్నారు. రాత్రి వేళల్లో చలి మంటలు వేసుకుని గ్రామాలకు కాపలా కాస్తున్నారు. రెండు నెలల కిందట మూడు పశువులను.. ప్రస్తుతం రెండు పశువులను పులి దాడి చేసి చంపేసిందని ఆవేదన చెందుతున్నారు.
చుట్టూ కొండలు మధ్యలో బూరుగు, చినకొండ, చివరస, బొంగిస, రాయిపాడు.. ఇలా మొత్తం ఐదు గ్రామాలు ఉన్నాయి. దీంతో రాత్రి వేళ.. ఏ సమయంలో పులి దాడి చేస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏళ్ల తరబడి కొండ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల కూడా ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. గతంలో సబ్ కలెక్టర్.. ఐటీడీపీఓ వచ్చినప్పటికీ.. చూసి వెళ్లిపోయారని విద్యుత్ ఇవ్వలేకపోయారని చెబుతున్నారు.
ఇప్పటికైనా విద్యుత్ సౌకర్యం కల్పించి పులి నుంచి, ఇతర క్రూర జంతువుల నుంచి తమ పశువులను రక్షించాలని ఈ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా పులి నుంచి, వివిధ రకాలైన క్రూర జంతువుల నుంచి తమకు రక్షణ కల్పించాలని అంటున్నారు.
ఇవీ చదవండి: