Teachers behaved rudely with students: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల కీచకపర్వం బయటపడింది. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు సోమవారం ఎస్సై రవికుమార్, సర్పంచి కె.పరదేశీ పాఠశాలకు వెళ్లి బాలికలను విచారించారు. రసాయనశాస్త్రం, హిందీ బోధించే ఉపాధ్యాయులు తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు వారు రోదించారు. తాను ఒంటరిగా ఉన్నానంటూ ఓ ఉపాధ్యాయుడు ఎక్కడపడితే అక్కడ తాకుతున్నారని వాపోయారు. అనారోగ్యంగా ఉందని సిక్ రూంలో పడుకుంటే హిందీ ఉపాధ్యాయుడు వచ్చి అసభ్యకరంగా మాట్లాడారని ఓ విద్యార్థిని వాపోయారు.
Teachers behaved rudely with students: 4 నెలల నుంచి వారానికి ఒక్కరోజు మాత్రమే మాంసం పెడుతున్నారని.. పాలు, గుడ్లు ఇవ్వడం లేదని వివరించారు. సమయానికి భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. పాఠశాల కోసం ఫినాయిల్, చీపుర్లు కొనేందుకు తమ వద్దే డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. కొన్ని నెలలుగా న్యాప్‌కిన్లు, సబ్బులు, పేస్టులు, నూనె ఇవ్వడం లేదని ఆరోపించారు. విద్యార్థినుల ఇబ్బందులను గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎస్సై చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మత్తుకు బానిసై వేధింపులు.. కుమారుడిని హతమార్చిన తల్లి