Maoist AOB Special Zone Committee Secretary Letter : మావోయిస్టు ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దు స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట ఓ లేఖ విడుదలైంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని.. 'శ్రామిక మహిళా పోరాట దినం'గా గ్రామ గ్రామంలో అందరూ జరుపుకోవాలని లేఖలో సూచించారు. మహిళలపై కొనసాగుతున్న భూస్వామ్య, కుల, తెగ పెట్టుబడిదారీ, పితృస్వామ్య అణచివేతపై పోరాడాలన్నారు. మహిళల సమానత్వం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మావోయిస్టుల సభలు, ఊరేగింపులను.. ప్రభుత్వం సాయుధ పోలీసుల ద్వారా అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అన్ని ప్రాంతాల్లోని మహిళలు చేసే పలు కార్యక్రమాల్లో బహుమతులు ప్రదానం చేస్తున్నారు. మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడటం లేదని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టే మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
దేశంలో మహిళలపై నిత్యం లైంగిక దాడులు, వేధింపులు, అత్యాచారాలు, అవమానాలు, హత్యలు, ప్రేమోన్మాద దాడులు పెరుగుతున్నాయని.. ఇందులో ఎక్కువగా దళిత, ఆదివాసి, పేద మహిళలే బలి అవుతున్నారన్నారు. చట్టాలు, న్యాయాలు, పోలీసు వ్యవస్థ మహిళలకు ఎక్కడా రక్షణ, న్యాయం కల్పించడం లేదని విమర్శించారు. మహిళా సమానత్వం, సాధికారత, హక్కుల గురించి మాట్లాడే నాయకులు.. వారికి అన్యాయం జరుగుతుంటే మాత్రం పట్టించుకోవడం లేదు.
బేఠీ పడావో.. బేఠీ బచావో అంటూ గాండ్రించే భారతీయ జనతా పార్టీ.. మహిళలపై జరుగుతున్న దాడులపై మాత్రం నోరు మెదపడం లేదు. మహారాష్ట్రలో 3.2 లక్షలు, గుజరాత్లో 2.3 లక్షల మంది మహిళలకు ప్రత్యామ్నాయం లేక కుటుంబ పోషణ కోసం వ్యభిచార వృత్తిలోకి దిగి శరీరాలు అమ్ముకుంటూ జీవించడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయని గుర్తు చేశారు. బ్రాహ్మణీయ, హిందుత్వ మతోన్మాదులు లవ్ జిహాద్ పేరుతో కులాంతర, మతాంతర ప్రేమికులపై, ప్రేమ వివాహలపై దాడులు చేస్తున్నారన్నారు. పరువు హత్యలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలో 2008 వాకపల్లిలో గ్రే హౌండ్స్ పోలీసు బలగాలు మహిళలపై చేసిన అత్యాచారాన్ని గుర్తు చేశారు. ముంచంగిపుట్టు, భల్లుగుడ గ్రామంలో నలుగురు మహిళలపై జరిగిన అత్యాచారాన్ని గుర్తు చేసుకుని ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలు గడిచిపోయిన నేటికీ దోషులను శిక్షించలేదని లేఖలో పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న అన్యాయ ఆకృత్యాలపై అణిచివేత దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఏవోబీ జోన్లో గ్రామగ్రామానా సభలు, సమావేశాలు, ఊరేగింపులు జరపాలని మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ తెలిపారు. ఈ మేరకు లేఖలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: