అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో మన్యం వీరుడు అల్లూరి శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చింతపల్లి పోలీసు స్టేషన్‌పై అల్లూరి మెరుపు దాడి చేసి నేటితో వందేళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ ముండా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొరలు ముఖ్యఅతిథులుగా హాజరై చింతపల్లి పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహానికి నివాళులర్పించారు.
స్వాతంత్య్రోద్యమంలో భాగంగా 300 మంది గిరిజన వీరుల సాయంతో చింతపల్లి పోలీసు స్టేషన్‌పై అల్లూరి దాడి చేసి మన్యం తిరుగుబాటుకి నాంది పలికారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆనాటి తిరుగుబాటు జ్ఞాపకాలు, నాటి చరిత్రను నేటి భావితరాలకు గుర్తు చేయాలన్న ఉద్దేశంతో అల్లూరి శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ నిధులతో చింతపల్లి స్టేషన్‌ని పునరుద్ధరించి, అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి