మాస్టర్ బ్లాస్టర్... సచిన్ టెండూల్కర్... ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. క్రికెట్ దేవుడిగా పిలిచే సచిన్ టెండూల్కర్ ను అభిమానించే వీరాభిమానులు దేశంలో కోకొల్లలు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ వీరాభిమాని తన కుమారుడికి సచిన్ పేరు కలిసేలా.. "అర్జున్ టెండూల్కర్" పేరు పెట్టుకున్నాడు. అంత పెద్ద ప్లేయర్ పేరు పెట్టుకున్న అర్జున్.. ఆ పేరు నిలిపాడు. సచిన్‌లా చిన్న వయసులోనే.. పరుగుల మోత మోగిస్తున్నాడు. కడపలో జరుగుతున్న అండర్-16 క్రికెట్ మ్యాచ్ లో కడప జట్టుపై ట్రిపుల్ సెంచరీ బాదేశాడు.
చిన్న వయసు నుంచే..
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన అర్జున్.. నాలుగేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. తన తండ్రి ఆదినారాయణ.. సచిన్ మీద అభిమానంతో తన కుమారుడికి.. అర్జున్ టెండూల్కర్ అని పేరు పెట్టుకున్నాడు. సచిన్ కుమారుడి పేరు కూడా అర్జునే..! తమ గ్రామంలో క్రికెట్ ఆడటానికి సరైన మైదానం లేని పరిస్థితుల్లో.. అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అర్జున్ టెండూల్కర్ కోసమే కుటుంబం గొట్లూరు నుంచి అనంతపురానికి మకాం మార్చారు. నిరంతర సాధన చేస్తున్న అర్జున్... ఆడుతున్న ప్రతి మ్యాచ్ లోనూ మెరుగైన స్కోరు సాధిస్తున్నాడు. ప్రస్తుతం కడప కేఓఆర్ఎం కళాశాల మైదానంలో జరుగుతున్న అండర్-16 అంతర్ జిల్లాల క్రికెట్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు.
ట్రిపుల్ సెంచరీతో...
అనంతపురం - కడప జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 215 బంతుల్లో 39 ఫోర్లు, 13 సిక్సులతో 308 పరుగులు చేశారు. ఓవర్ నైట్ స్కోరు 391 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన అనంతపురం జట్టు... 134 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 618 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన కడప జట్టు 42.2 ఓవర్ల లో 134 పరుగులకే కుప్పకూలింది. ఫాలోఆన్ లో రెండో ఇన్నింగ్స్ ఆడుతూ...86 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతపురం జట్టు ఇన్నింగ్స్ 399 పరుగుల తేడాతో విజయం సాధించింది. కిందటి ఏడాది ఇదే మైదానంలో అండర్ -14 విభాగంలోనూ అర్జున్ చెండూల్కర్.. డబుల్ సెంచరీ, సెంచరీ నమోదు చేశాడు.
కుటుంబమంతా ప్లేయర్లే ..
చేనేత కుటుంబానికి చెందిన ఆదినారాయణ, పార్వతి దంపతుల నలుగురి సంతానంలో ముగ్గురు క్రికెట్ ప్లేయర్లే. పెద్ద కుమార్తె లీలావతి మినహా.... అర్జున్ టెండూల్కర్ సోదరి పల్లవి క్రికెట్ స్టేట్ ప్లేయర్ కాగా.... తమ్ముడు మణిదీప్ అండర్-14 ఆడుతున్నాడు. అర్జున్ ఇప్పటివరకూ అండర్-12, అండర్-14, అండర్-16, అండర్-19 విభాగాల్లో రాణించాడు. చేనేత కుటుంబానికి చెందిన తన తండ్రి... క్రికెట్‌పై మక్కువతోనే ప్రోత్సహిస్తున్నారని... కుటుంబ పోషణ భారమైనా.... తమను మంచి క్రికెటర్ గా చూడాలనే కోరికతో తాము అడిగిన బ్యాట్లు, కిట్లు కొనిస్తున్నారని అర్జున్ చెబుతున్నాడు. తండ్రి ఆశయాన్ని నిలెబట్టి, ఎప్పటికైనా టీమిండియాకు ఆడాలన్నదే తన లక్ష్యమని అర్జున్ అంటున్నారు. సచిన్ తరహాలో చిన్న వయసులోనే అదరగొడుతున్న అర్జున్ టెండూల్కర్.. సచిన్ అంత గొప్ప ప్లేయర్ కావాలని అంతా ఆశిస్తున్నారు.