ఉదయం లేవగానే... కనీసం రెండు నిమిషాలు శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. ఆపై కాలకృత్యాలు తీర్చుకున్నాక గోరువెచ్చని నీళ్లు తాగి రోజు మొదలుపెట్టండి. కాసేపు కసరత్తులు చేయండి. అయ్యాక అరగంటలోగా పది నానబెట్టిన బాదం గింజలు, రెండు ఖర్జూరాలు, ఓ గ్లాసు పాలు.. లేదంటే రెండు ఇడ్లీ, పాలు తీసుకోండి.
- అల్పాహారానికీ, భోజనానికీ మధ్య ఆకలేస్తే పండ్ల రసం తీసుకోవచ్చు. మధ్యాహ్నం ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, పెరుగు, బఠాణీలు, చిక్కుళ్లు, రాజ్మా, శనగలు, మాంసం, చేపలు వంటివి ఉంటే మేలు. వీటిలో ఐరన్, జింక్, క్యాల్షియంలతో పాటు విటమిన్లూ పుష్కలంగా దొరుకుతాయి. ఆపై ఆఫీసు, కాలేజీ, ఇంట్లో... ఎక్కడ ఉన్నా... అరగంటకోసారి రెండు నిమిషాలైనా అటూ ఇటూ నడవండి.
- సాయంత్రం స్నాక్స్‌లా పల్లీ, మొక్కజొన్న, పండ్ల ముక్కలు, చిక్కీ వంటివి తీసుకోవచ్చు. ఇవన్నీ ఆకలి తీర్చడంతో పాటు శక్తినీ ఇస్తాయి. సాయంత్రం కాసేపు నాలుగు అడుగులు వేయండి.
- రాత్రి ఆహారం వీలైనంత తేలిగ్గా ఉండాలి. చపాతీలు, అన్నం, కూరలు తీసుకోవచ్చు. ఈ వేళలో మసాలాలు, మాంసాహారం వంటివి సాధ్యమైనంత తక్కువగా తీసుకోండి.