తెలంగాణలోని మేడ్చల్‌లో దారుణం జరిగింది. కొంపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లికుమారుడు సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి ముహూర్తానికి ముందు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం పది గంటలకు వివాహం జరగాల్సి ఉండగా.. వేకువజామునే వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు.
ఏడు గంటల సమయంలో ఫంక్షన్ హాల్‌లో ఓ గదిలోకి ఒంటరిగా వెళ్లి సందీప్ గడియ పెట్టుకున్నాడు. ఎంతకూ వరుడు బయటకు రాకపోవటం వల్ల అనుమానించిన కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టి చూడగా సందీప్ అప్పటికే ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ ఘటనతో ఫంక్షన్‌హాల్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసా చారి, పద్మ దంపతుల కుమారుడైన సందీప్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతని ఆత్మహత్యకు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి: