కర్నాటకలోని బెంగళూరుకి చెందిన సతీశ్, మంజుల దంపతులు 12 ఏళ్ళ క్రితం బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. లాలాపేటలో బెంగళూర్ ఆయ్యంగార్ బేకరీని నడుపుతూ సతీశ్ జీవనంసాగిస్తున్నాడు. వీరికి రంజిత్(11), తేజస్(9) అనే ఇద్దరు కుమారులున్నారు. ఎప్పటిలాగే సతీశ్... ఉదయం బేకరీకి వెళ్లాడు. తన వెంట చిన్నకొడుకు తేజస్‌ను తీసుకెళ్ళాడు. ఇట్లో తల్లితో పాటు పెద్దకుమారుడు రంజిత్ ఉన్నాడు.
అసలేం జరిగిందంటే...
రంజిత్ ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో బట్టలు ఉతికి వస్తానంటూ... మంజుల గదిలోకి వెళ్ళింది. ఎంతకీ రాకపోయేసరికి రంజిత్ పలుమార్లు తల్లిని పిలిచాడు. అయినా స్పందించకపోయేసరికి అనుమానం వచ్చి గదిలోకి వెళ్ళి చూశాడు. తల్లి... చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకోవడం గమనించాడు. భయంతో ఉక్కిరిబిక్కిరి అయిన రంజిత్... తల్లిని అలా చేయొద్దంటూ వేడుకున్నాడు. తల్లి చరవాణీ నుంచి తండ్రికి ఫోన్ చేయగా... తీయలేదు. కళ్లముందే... విలవిలలాడుతున్న తల్లిని ఎలగైనా కాపాడలనుకున్నాడు. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. సమయానికి అపార్ట్మెంట్ వాసులు కూడా ఎవరూ లేరు.
ఓ వైపు భయం... మరోవైపు ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదుపుచేసుకుంటూనే... తల్లిని కాపాడేందుకు ఆ చిన్నారి ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. ప్రక్కన స్టూలు వేసుకుని వంట గదిలో ఉన్న కత్తితో ఉరి వేసుకున్న చీరను కోయడానికి ప్రయత్నించాడు. తన వల్ల కాకపోవటంతో... కంగారులో బేకరీ వద్దకు పరిగెత్తి తండ్రికి విషయం చెప్పాడు. తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తల్లి విగతజీవిలా వేలాడుతూ కనిపించింది. ఉదయాన్నే తనకు టిఫిన్ తినిపించి తండ్రితో పాటు బేకరీకి పంపిన తల్లిని ఈ స్థితిలో చూసి తేజస్ నిచ్ఛేష్టుడయ్యాడు. తల్లి తమను విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందన్న చేదు నిజాన్ని ఆ పసిహృదయాలు బరించలేక వెక్కి వెక్కి ఏడ్చారు.
ఎందుకు ఇలా చేసిందో...
తన భార్య ఇలా ఎందుకు చేసిందో తనకు తెలియడంలేదని భర్త సతీశ్ చెబుతున్నాడు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని... ప్రశాంతంగా జీవిస్తున్నామన్నామని తెలిపాడు. సెల్ఫీ వీడియోలో కూడా తన చావుకు ఎవరూ కారణం కాదని చెప్పిందన్నాడు. ఉదయం తనతో మంచిగానే ఉందని... ఎందుకు ఇలా చేసిందో తెలియదని వెల్లడించాడు. విషయం తెలుసుకున్న లాలాగూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరిలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంజుల చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో మంజుల చరవాణిని తనఖీ చేస్తున్నామని... కాల్ డేటాని పరిశీలిస్తామన్నారు. ఇటీవల సతీశ్ కుంటుంబం బెంగళూరుకు వెళ్ళి వచ్చిందని... అక్కడ ఏమైనా గొడవలు జరిగి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కళ్ల ముందే తల్లి చనిపోతున్నా... కాపాడలేక పోయానని చిన్నారి గుండెలవిసేలా రోధించిన తీరు స్థానికులను కన్నీళ్లు పెట్టించాయి. అమ్మ కావాలంటూ గుక్కపెట్టి ఏడ్చిన ఆ చిన్నారులను ఏమని చెప్పి బుజ్జగించాలో తెలియక అందరి మనసులు మదన పడ్డాయి. ఆ తల్లి తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయంతో ఇద్దరు చిన్నారులు అమ్మ ప్రేమకు దూరమయ్యారు.